గురి చూసి కొట్టడమే..!
● నేటి నుంచి రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఆర్చరీ టోర్నీ ● 22నుంచి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ● అండర్–19 విభాగాల్లో పోటీలకు రెడీ
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడాపోటీల నిర్వహణ బాధ్యతను జిల్లాల వారీగా కేటాయించారు. ఇందులో ఆర్చరీ, బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీల అవకాశం ఖమ్మం జిల్లాకు దక్కింది. ఈమేరకు గురువారం నుంచి రెండో రోజులపాటు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్–19 బాలబాలికల ఆర్చరీ పోటీలు జరగనున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరు కానున్నారు. రికర్వ్, కాంపౌండ్, ఇండియాన్ రౌండ్లలో జరిగే పోటీల్లో తొలిరోజు క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించి, రెండో రోజు అత్యధిక పాయింట్లు సాధించిన వారిని చాంపియన్లుగా ప్రకటిస్తారు.
అండర్–19 బాల్‌బ్యాడ్మింటన్..
సీఎం కప్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈనెల 22, 23, 24వ తేదీల్లో జరిగే పోటీలకు 33జిల్లాల నుంచి దాదాపు 800మంది క్రీడాకారులు రానున్నారు. దీంతో ఒకేసారి ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించేలా ఎనిమిది కోర్టులు సిద్ధం చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం...
ఆర్చరీ, బాల్‌బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా వేదికగా నిలుస్తున్నందున అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన పనులను పరిశీలించి మాట్లాడారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తుండగా, స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లు పర్యవేక్షిస్తారని తెలిపారు. జాతీయ ఆర్చరీ డెవలప్‌మెంట్ సభ్యుడు, ఆర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల నిర్వహణ బాధ్యత ఖమ్మంకు కేటాయించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. అండర్–19 విభాగంలో జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు ఉన్నందున కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశముందని తెలిపారు. బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొంతు శ్రీనివా స్ మాట్లాడుతూ మూడు రోజుల్లో 182 మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. ఈసారి కొత్తగా డబుల్స్ విభాగంలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.


