నేలకొండపల్లి ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ప్రతిపాదనలు
నేలకొండపల్లి: నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసేలా ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. సీహెచ్‌సీని గురువారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం డీసీహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆస్పత్రి అప్‌గ్రేడ్ కోసం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో ప్రభుత్వం వివరాలు కోరగా పంపించామని చెప్పారు. అప్‌గ్రేడ్ అయితే వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరిగి ప్రజలకు మెరుగైన వసతులు అందుతాయని తెలిపారు. కాగా, శస్త్రచికిత్సలు, ప్రసవాల సంఖ్య పెంచేలా అవసరమైన సామగ్రి కొనుగోలుకు రూ.15 లక్షలు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ మంగళ, ఉద్యోగులు పాల్గొన్నారు.
మరింత పటిష్టంగా ఈ–నామ్
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్లలో పంటల కొనుగోళ్లకు అమలు చేస్తున్న ఈ–నామ్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ సూచించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ–నామ్‌లో గేట్ ఎంట్రీ, గుర్తింపు నంబర్ కేటాయింపు, బిడ్డింగ్ నిర్వహణ తదితర పనులు జరుగుతున్నా తక్‌పట్టీ విడుదల, ఆన్‌లైన్ పేమెంట్ జరగడం లేదని అధికారులు తెలిపారు. అయితే, ఇక నుంచి అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే చేయాలని, తద్వారా పారదర్శకత ఉంటుందని డైరెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా నుంచి డీఎంఓ అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


