మహిళా సమాఖ్యలకు సిరుల పంట
ఆర్థిక భరోసా..
● ఆర్టీసీ బస్సులతో భారీ ఆదాయం ● ఈఎంఐలు సకాలంలో చెల్లింపులతో సభ్యులకు ఊరట ● ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 21 బస్సులకు రూ.87,52,968
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 21 మండల సమాఖ్యలకు కేటాయించిన ఆర్టీసీ బస్సుల ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. కేవలం అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఇప్పుడు మహిళా సమాఖ్యల ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోంది. మహిళా శక్తి పథకం ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులను అప్పగించిన మహిళా సమాఖ్యలకు యాజమాన్యం క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తుండడంతో ఈ పథకం ద్వారా మహిళా సభ్యులకు మంచి ఫలితాలు అందుతున్నాయి. గతంలో రెండు నెలల అద్దెలు విడుదల కాగా.. ఇటీవల ఆరు నెలల అద్దెలను ఆర్టీసీ యాజమాన్యం మహిళా సమాఖ్యలకు చెల్లించింది.
ఉమ్మడి జిల్లాలో 21 బస్సులు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)కు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 31 బస్సులను ఏర్పాటు చేసేందుకు మహిళా సమాఖ్యలకు అనుమతులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 21 బస్సులను మహిళా సంఘాల ద్వారా సమకూర్చారు. వీటిలో ఖమ్మం జిల్లాలో 19 మండల సమాఖ్యల నుంచి 19 బస్సులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు మండల సమాఖ్యల నుంచి రెండు బస్సులను ఏర్పాటు చేశారు. మొత్తం 21 మండల సమాఖ్యల నుంచి ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షల చొప్పున నిధులు సమకూర్చారు. వీటిలో మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు చెల్లించగా, ప్రభుత్వం రూ.30 లక్షలను సీఏఎఫ్ (క్రెడిట్ అవిడంట్ ఫండ్)గా మంజూరు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మండల సమాఖ్యలకు ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారతకు పటిష్టమైన పునాదులు పడనున్నాయి.
నెలకు రూ.69,468 వేల ఆదాయం
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 21 మండలాల మహిళా సమాఖ్యలకు చెందిన బస్సులు వివిధ డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున ఈఎంఐ(అద్దె) రూపంలో ఆదాయం అందుతోంది. గత ఆరు నెలల కాలానికి గాను ప్రతీ మండల సమాఖ్య ఖాతాలో రూ.4,16,808 జమ అయ్యాయి. మహిళా సమాఖ్యలు కేవలం రూ.6 లక్షల పెట్టుబడి పెట్టగా, ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షల వరకు వెచ్చించింది. మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించిన బస్సులకు ప్రతినెల సంస్థ సంబంధిత మహిళా సమాఖ్యలకు అద్దెలు చెల్లిస్తోంది. గత ఆరు నెలల కాలానికి ఆర్టీసీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 21 బస్సులకు గాను రూ.87,52,968 చెల్లించింది.
ఇది బ్యాంక్ రుణం కాదని, ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అందజేసిన ఒక గొప్ప ఆర్థిక అవకాశమని అధికారులు పేర్కొంటున్నారు. 84 నెలల ఒప్పందం ముగిసిన తర్వాత, ఈ బస్సులను తిరిగి ఆర్టీసీకి అప్పగించాల్సి ఉంటుంది. అప్పటివరకు వచ్చే ఈ ఆదాయం మహిళా సమాఖ్యల బలోపేతానికి, మండల స్థాయిలో సామాజిక కార్యక్రమాలకు ఎంతో దోహదపడనుంది. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు సంబంధించిన అద్దెలను చెల్లించడంతో జిల్లాలోని మహిళా సమాఖ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అప్పగించడం ద్వారా తాము ఓనర్లం కాగలిగామని, ఇది తమ ఆర్థిక ఎదుగుదలకు మరో అడుగుగా భావిస్తున్నామని తెలిపారు.


