రైతు వ్యతిరేక విధానాలపై పోరు
● ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ● ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వెంకయ్య, క్షీరసాగర్
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల వెంకయ్య, రాజన్ క్షీరసాగర్ తెలిపారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రం తెస్తున్న కొత్త విత్తన బిల్లు రైతుల స్వతంత్రాన్ని హరించి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తుందని విమర్శించారు. అమెరికా ఒత్తిడితో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలతో ఇక్కడ పత్తి, సోయాబీన్, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. గత పదేళ్లలో వ్యవసాయ దిగుమతులు ఐదు రెట్లు పెరగడం వల్ల దేశీయ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపారు. ఇకనైనా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనమన్నారు. ఆయా రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక తమిళనాడు తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కిసాన్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా, ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చాతో కలిసి చేసే పోరాటంలో భాగంగా ఈనెల 26న నుంచి ఫిబ్రవరి 11 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం, ఫిబ్రవరి 12న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల హక్కులను కాపాడుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, రాష్ట్ర నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, అడపా రామకోటయ్య, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


