ఆధ్యాత్మిక, సమాజ సేవ రెండూ భగవత్ ఆరాధనే..
ఖమ్మంఅర్బన్: ఆధ్యాత్మిక సేవ, సమాజ సేవ వేర్వేరు కావని.. ఇవి భగవంతుడి ఉపాసనకు రెండు రూపాలని త్రిదండి చిన జీయర్ స్వామి తెలిపారు. ఖమ్మంలో బుధవారం జరిగిన గోదాదేవి కల్యాణానికి హాజరైన స్వామి.. పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు, వికాస తరంగిణి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విశ్వంలో ప్రతీ ప్రాణిలో ఉండే ఆత్మను తృప్తిపర్చాలంటే శరీరం ద్వారానే సాధ్యమని వివరించారు. అలాగే, భగవంతుడిని తృప్తి పర్చాలంటే ఆయన శరీరమైన సమాజం, ప్రకృతికి సేవ చేయాల్సిందేనని తెలిపారు. వికాస తరంగిణి ద్వారా 40 లక్షల మంది మహిళలకు కేన్సర్‌పై అవగాహన, పరీక్షలు నిర్వహించామని, ప్రజ్ఞా కోర్సుల ద్వారా వేలాది మందికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీయర్ సంస్థల సలహాదారుడు ఎర్నేని రామారావు, న్యాయవాది పొట్ల మాధవరావుతో పాటు దొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
త్రిదండి చిన జీయర్‌స్వామి


