అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–4 కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంగళవారం అందజేశాక కలెక్టర్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామాల్లో పచ్చదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వంద శాతం పన్నులు వసూలు చేస్తూనే ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ పంచాయతీ అధికారి రాంబాబు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పంటలకు సరిపడా యూరియా నిల్వలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో యూరియా పంపిణీకి సమగ్ర చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. యాసంగి పంటల సాగుకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నందున దుష్ప్రచారాలను రైతులు నమ్మొద్దని సూచించారు. అన్ని మండలాల్లో పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచి పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 11,817 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 25,773 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని పేర్కొన్నారు. జిల్లా యంత్రాగం నిరంతరం పర్యవేక్షిస్తున్నందున రైతులు అపోహలకు గురికావొద్దని, ఎక్కడైనా సమస్య ఎదురైతే ఏఓ, ఏఈఓల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.
కలెక్టర్ అనుదీప్


