లెర్నింగ్ లైసెన్స్‌తో పాటు హెల్మెట్లు
ఖమ్మంక్రైం: రవాణా శాఖలో ఏజెంట్ల దందాను అరికట్టేందుకు వాహనదారులు తమ పనుల కోసం నేరుగా వచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈక్రమంలోనే నేరుగా దరఖాస్తు చేసుకుని వచ్చి లెర్నింగ్ లైసెన్స్ పొందిన పలువురికి జిల్లా రవాణా శాఖ అధికారి జగదీష్ మంగళవారం లైసెన్స్ కాపీతో ప్రోత్సాహకంగా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌టీఓ మాట్లాడుతూ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వాహనదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని నేరుగా కార్యాలయానికి రావాలని సూచించారు. కాగా, రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం ఎన్‌ఎస్‌సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిబంధనలపై పరీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీఏ సభ్యుడు వెంకన్న, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలతతో పాటు రవిచంద్రన్, రమేష్, సరిత తదితరులు పాల్గొన్నారు.


