ధూప, దీప నివేదన రూ.35 వేలకు పెంచాలి
ఖమ్మంగాంధీచౌక్: ధూప, దీప నివేదన పథకంలో భాగంగా అర్చకులతో పాటు నివేదనకు ప్రతీనెల ఇస్తున్న నగదును రూ.35వేలకు పెంచాలని ధూప, దీప, నివేదన(డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ డిమాండ్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల స్థాయి అర్చకుల సమావేశం ఖమ్మంలో మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. 2007లో మొదలైన డీడీఎన్ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,758 మంది అర్చకులు పనిచేస్తుండగా, అర్చకులకు రూ.6 వేలు, నివేదనకు రూ.4 వేలు కలిపి రూ.10 వేలు ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నగదు సరిపోవటం లేదని, ఇకనైనా అర్చకులకు రూ.26 వేలతో పాటు నివేదికకు రూ.10 వేలు కేటాయించాలన్నారు. అలాగే, అర్చకులు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతీనెల 5వ తేదీన వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రతీ జిల్లాలో అర్చక భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీడీఎన్ జిల్లా అధ్యక్షుడు మునగలేటి రమేష్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు తుంబూరి దయాకర్‌రెడ్డి, ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, మార్కెట్ల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, బైరి హరినాథబాబు, నర్సింహారావు, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావుతో పాటు విశాలాక్షి, ఇంగువ రామకృష్ణ, పురాణం కిరణ్‌శర్మ, సంతోష్‌శర్మ, భార్గవాచార్యులు, ఆమంచి సురేష్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం అందజేచారు.
డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వాసుదేవశర్మ


