చిత్తడి నేలల గుర్తింపునకు కార్యాచరణ
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపునకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెట్ ల్యాండ్ పరిమితి, ప్రాంతం స్పష్టంగా తెలిసేలా సర్వే శాఖ సహకారంతో నోటిఫికేషన్ రూపొందించాలని తెలిపారు. పట్టా భూముల సర్వే నెంబర్లు స్పష్టంగా తెలిసేలా పొందుపర్చాలని చెప్పారు. కాగా, చిత్తడి నేలలు నోటిఫికేషన్ ద్వారా భూమి యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నేలల్లో స్వభావ మార్పు చేయకుండా, నిర్మాణ వ్యర్థాలు, శుద్ధి చేయని వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ విషయమై గ్రామ సభలు నిర్వహించి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ చిత్తడి భూముల జియో ట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా భూముల్లో నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, ఎఫ్‌డీఓ మంజుల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


