జాతీయ కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు
పినపాక: జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలకు మండలంలోని ఈ.బయ్యారంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోటీలపై యువత సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తోంది. ‘మన గ్రామం, మన క్రీడలు, మన బాధ్యత’ ట్యాగ్‌లైన్‌తో పోస్టులు పెడుతున్నారు. అధికారులు ప్రత్యే క ఆకర్షణగా భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలకు పోస్టర్లు అంటించడంతోపాటు మైకులతో ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రాల జట్లు రాక
పోటీలు బుధవారం ప్రారంభంకానుండగా, సోమవారమే పలు రాష్ట్రాల జట్లు ఈ.బయ్యారం చేరుకున్నాయి. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల జట్ల క్రీడాకారులు రాగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు వారిని బస చేసే ప్రదేశానికి తరలించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జాతీయస్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సోమవారం పోటీలు నిర్వహించే ఈ.బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో అధికారుల అలస్తత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటీపీఎస్, సింగరేణి సంస్థలను భాగస్వామ్యం చేసుకుని పనులు పూర్తి చేయాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు. డీఈఓ నాగలక్ష్మి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.
జాతీయ కబడ్డీ పోటీలకు నవోదయ విద్యార్థులు
కూసుమంచి : ఈ నెల 7 నుంచి ఏడూళ్ల బయ్యారంలో నిర్వహించే జాతీయ స్థాయి అండర్ –17 కబడ్డీ పోటీల్లో వివిధ రీజియన్‌లకు చెందిన 12 మంది నవోదయ విద్యార్థులు పాల్గొంటున్నారు. వారికి డిసెంబర్ 27 నుంచి సోమవారం వరకు పాలేరు నవోదయ విద్యాలయలో ప్రత్యేక శిక్షణను అందించారు. హైదరాబాద్, పుణె, లక్నో, భోపాల్, పాట్నా రీజియన్లకు చెందిన విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికయ్యారు. కాగా, పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసులు సోమవారం వారికి స్సోర్ట్స్ కిట్లను అందించారు.
రేపటి నుంచి ఈ.బయ్యారంలో
ప్రారంభంకానున్న క్రీడలు


