ఇదో రకం మోసం..!
● పెట్రోల్ బంక్ యజమానులకే బురిడీ ● ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఉడాయిస్తున్న వాహనదారులు ● ఖమ్మానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తింపు
ఖమ్మం అర్బన్ : సహజంగా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరుగుతోందని, తక్కువ ఇంధనం పోస్తున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తుంటాయి. కానీ ఇందుకు విరుద్ధంగా కొందరు ఘరానా మోసగాళ్లు పెట్రోల్ బంక్ యజమానులనే బురిడీ కొడుతున్న ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. కార్లలో డీజిల్, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని డబ్బు చెల్లించకుండా ఉడాయిస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం నగరంలోని దంసలాపురం, చింతకాని మండలం నాగులవంచ, బోనకల్ మండలంలోని ఓ బంక్, కొణిజర్ల మండలం లాలాపురంలోని బంక్‌ల్లో ఇలాగే ఇంధనం నింపుకుని డబ్బులు ఇవ్వకుండా కారులో పారిపోయినట్లు బంక్ మేనేజర్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణ..
గత నెలలో లాలాపురం బంక్‌లో డీజిల్ కొట్టించుకుని కారులో ఉడాయించిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళల్లో బంకుల్లో సిబ్బంది తక్కువగా ఉండడాన్ని ఆసరాగా తీసుకుని, ఇంధనం నింపిన వెంటనే పరారవుతున్నారు. ఆదివారం సాయంత్రం ధంసలాపురం బంక్ వద్ద ఇలాగే పెట్రోల్ పోయించుకుని పరారు కాగా, కారును గుర్తించిన బంక్ యజమానులు పోలీసులకు సమాచారం అందించగా ఆ కారును పట్టుకుని నిందితులపై విచారణ చేపట్టారు. చింతకాని, బోనకల్ మండలాల్లో కూడా ఇదే కారుతో ఇంధనం నింపుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ధంసలాపురం ఘటనలో ఖమ్మం నిజాంపేటకు చెందిన పి.శివానంద్, రాపర్తినగర్‌కు చెందిన బి. కార్తీక్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. మరో యువకుడి కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.


