గూడు గోసకు చెక్..
త్వరలోనే రెండో విడత..
అర్హులకే దక్కేలా అధికారుల పర్యవేక్షణ జిల్లాలో 16,523 గృహాలు మంజూరు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్న నిర్మాణాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత పంపిణీ
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వివరాలు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : సొంత ఇల్లు లేని పేదలందరినీ ఇందిరమ్మ ఇళ్లు వరిస్తున్నాయి. రెక్కాడితేనే డొక్కాడని స్థితిలో ఉండే నిరుపేదలకు ఈ పథకం భరోసా కల్పిస్తోంది. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 16,523 ఇళ్లు మంజూరు కాగా.. యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 7,341 ఇళ్లకు స్లాబ్ వేయగా.. 324 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. చాలా ప్రాంతాల్లో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ.. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
అర్హతే ప్రామాణికం..
అర్హతే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు సాగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక మూడు కేటగిరీల్లో జరిగింది. సొంత స్థలం ఉండి గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండే వారిని ఎల్–1గా గుర్తించారు. గుడిసెలు, రేకులషెడ్‌లు, టైల్స్ వేసిన ఇళ్లు, అద్దె ఇళ్లల్లో ఉంటూ స్థలం కూడా లేని వారిని ఎల్–2గా, ఇల్లు ఉండి తల్లిదండ్రుల నుంచి విడిపోయి తమకు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్–3 కేటగిరీలో చేర్చారు. ఇందులో ప్రాధాన్యతా క్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ముగ్గు పోయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి దశలోనూ ఇంటి నిర్మాణ స్థితిని ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. నిబంధనల మేరకు పూర్తయిన ఇళ్లకే నిధులు విడుదలవుతున్నాయి.
జిల్లాకు 16,523 ఇళ్లు మంజూరు..
ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో గతంలో ప్రజాపాలనతోపాటు మీసేవ, గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 3,48,639 దరఖాస్తులు గృహ నిర్మాణ శాఖకు అందాయి. అలాగే తొలుత పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 20 గ్రామపంచాయతీలను ఎంపిక చేయగా.. అందులో 867 దరఖాస్తులు అర్హత సాధించాయి. ఇక గృహనిర్మాణ శాఖకు అందిన దరఖాస్తుల్లో 15,656 అర్హత గలవిగా గుర్తించగా.. మొత్తం 16,523 ఇళ్లు మంజూరయ్యాయి.
చకచకా..నిర్మాణాలు..
జిల్లాలో 16,523 ఇళ్లు మంజూరు కాగా.. వివిధ కారణాలతో 2,199 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. 3,023 ఇళ్లకు పునాది వేశారు. 7,341 ఇళ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయి. 324 ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలకు సిద్ధమయ్యాయి. మొత్తంగా మంజూరైన వాటిలో 87 శాతం ఇళ్లకు ముగ్గులు పోయగా, అందులో 94శాతం ఇళ్లు పునాది వరకు వచ్చాయి. దశల వారీగా బిల్లులు తమ ఖాతాల్లో జమవుతుండగా లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అలాగే జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు.
ఆ ఇళ్లకూ మోక్షం..
జిల్లా వ్యాప్తంగా పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరై వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని గతంలోనే సర్కారు నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. గతంలో ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.3 లక్షలు దశల వారీగా అందిస్తామని ప్రకటించింది. దీంతో ఈ పథకం కింద కొందరు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం గృహలక్ష్మి ఇళ్లను కూడా ‘ఇందిరమ్మ’ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి ఇటీవలే ప్రకటించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు.. తమకు ఇల్లు ఎప్పుడొస్తుందో.. రెండో దశలో అయినా తమకు దక్కుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం


