రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
జిల్లా జడ్జి రాజగోపాల్
ఖమ్మంలీగల్: ప్రతీ వ్యక్తి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. రహదారి భద్రత కార్యాచరణ పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 9 వరకు రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు వస్తుందన్నారు. మద్యం సేవించి, అతి వేగంగా వాహనాలను నడపవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కల్పన తదితరులు పాల్గొన్నారు.
10వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్న కా సహారా పథకాల కోసం అర్హులైన మైనార్టీ మహిళలు, ఫకీర్, దూదేకులు ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముహమ్మద్ ముజాహిద్ సూచించారు. https:// tgobmms. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అవివాహిత మహిళలకు చిరు వ్యాపారాల కోసం రూ.50 వేల చొప్పున, రేవంతన్న కా సహారా పథకం కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాల కొనుగోలుకు రూ.లక్ష గ్రాంట్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
10న ఖో–ఖో జిల్లా
జట్ల ఎంపిక
కల్లూరు: సబ్ జూనియర్స్ బాలురు, బాలికల జిల్లా ఖో–ఖో జట్ల ఎంపిక పోటీలు ఈనెల 10న నిర్వహించనున్నారు. జిల్లా ఖో–ఖో అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతాయని పీఈటీ పి.వీరరాఘవయ్య తెలిపారు. 2012 ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల వారు స్టడీ సర్టిఫికెట్ ఒరిజినల్, జనన ధ్రువపత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో కల్లూరు మినీ స్టేడియంలో జరిగే పోటీలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94406 69401 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు. కాగా, అదేరోజు ఖో–ఖో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నందున సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.
8న క్రీడాజ్యోతి ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్ : రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించి ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా ఈనెల 8న క్రీడాజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది జరుగనున్న సీఎం కప్ క్రీడల్లో భాగంగా ఈ ర్యాలీ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ర్యాలీకి క్రీడా సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులు తరలి రావాలని కోరారు.
రైతులకు అందుబాటులో యూరియా
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
కొణిజర్ల/చింతకాని: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొణిజర్ల మండలం పెద్దగోపతి, చింతకాని మండలం నాగిలిగొండలో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 185 కేంద్రాల ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు.
పందిళ్లపల్లికి చేరిన ఎరువులు
చింతకాని: మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 2,640.30 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సోమవారం చేరాయి. 20.20.0.13 ఎరువులు 1,339.80 మెట్రిక్ టన్నులు, 28.28.0 ఎరువులు 1300.50 మెట్రిక్ టన్నులు చేరినట్లు టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ తెలిపారు.


