ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్!
● కేఎంసీ ఎన్నికలకు కౌన్సిల్ రద్దు తప్పనిసరి ● నిబంధనలు అడ్డుగా ఉండడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి ● ప్రస్తుతం ప్రభుత్వ సిఫారసు ఒక్కటే మార్గం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నామొన్నటి వరకు కౌన్సిల్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని పాలకవర్గం హడావుడి చేయగా.. అందుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకుంది. అయినప్పటికీ ఫిబ్రవరిలో మిగతా మున్సిపల్, కార్పొరేషన్లతోపాటే కేఎంసీ ఎన్నికలు జరగాలంటే ఏం చేయాలా అన్న అంశంపై చర్చలు మాత్రం కొనసాగిస్తోంది. మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కౌన్సిల్ రద్దు నిర్ణయం పాలకవర్గం చేతిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సిఫారసు చేసే అవకాశం ఉన్నందున ఆ దిశగా ప్రయత్నించాలా అనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
నిబంధనలు అడ్డు..
మున్సిపాలిటీల్లో పాలకవర్గాల రద్దు, సభ్యుల సస్పెన్షన్, రాజీనామాల వంటి వాటిపై 2019 మున్సిపల్ చట్టంలో ప్రభుత్వం కీలక నిబంధన పొందుపరిచింది. ఈ చట్టం ప్రకారం పాలకవర్గాలకు స్వయంగా రద్దు చేసుకునే హక్కు లేకపోగా, రాజీనామా చేయడానికి మాత్రం అవకాశం కల్పించారు. ఇదే సమయాన ప్రభుత్వానికి కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం కట్టబెట్టారు. అయితే, కేఎంసీ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేయాలన్నా ఏదో ఒక లోపాన్ని చూపించాలి. ప్రభుత్వం ఆ విధంగా కౌన్సిల్‌ను రద్దు చేస్తుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయిననూ ఎన్నికలకు వెళ్లాల్సిందే..
కౌన్సిల్ రద్దుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని తెలిశాక ఎన్నికలకు వెళ్లే ఇతర మార్గాలపై అధికార పార్టీ అన్వేషిస్తోంది. మరోపక్క ప్రభుత్వం కౌన్సిల్ రద్దుకు సిఫారసు అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని కొందరు నేతలు బలంగా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడైతేనే కేఎంసీలో సత్తా చాటొచ్చని భావిస్తూ కలిసొచ్చే పార్టీలతో చర్చలు జరపడమే కాక పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ప్రతిపక్ష కార్పొరేటర్లతోనూ సంప్రదింపులు చేస్తున్నారు.
ముందస్తుకు అవకాశం
కౌన్సిల్ రద్దు ప్రక్రియకు అన్ని దారులు మూసుకుపోవడంతో అధికార పార్టీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం గడువు నాలుగు నెలలే ఉండగా, ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు అవకాశం ఉంది. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ సిఫారసుతో ఫిబ్రవరిలో అన్ని మున్సిపల్, కార్పొరేషన్లతో పాటే కేఎంసీకి కూడా ఎన్నికలు నిర్వహించేలా పావులు కదిపేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. తద్వారా ప్రస్తుత పాలకవర్గ గడువు ముగిశాకే కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
అన్నింటికీ సిద్ధంగా యంత్రాంగం
ఖమ్మంనగర పాలకసంస్థలో పెరిగిన ఓటర్లు, జనా భా ఆధారంగా డివిజన్లను విభజించాలని అధికారులు గత నెల 24న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసుతో ప్రభుత్వానికి లేఖరాశారు. అయితే ప్రభుత్వంనుంచి ఇంకా అనుమతిరాలేదు. మరోప క్క ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సాగుతోంది. కేఎంసీకి ఎన్నికలు జరపాలంటే ఈనెల 10వ తేదీలోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే మిగతా ప్రక్రియ నిర్వహించేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం డివిజన్ల పెంపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. తద్వారా మే నెల నాటికి డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి, కొత్త ఓటర్ల జాబితా ద్వారా జూన్ – జూలైలో ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.


