విద్యుత్ శాఖ ‘ప్రజాబాట’
● ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో కార్యక్రమం ● నేటి నుంచి ప్రారంభం
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని రూపొందించింది. నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించింది. ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, మధిర, వైరా, సత్తుపల్లి డివిజన్ల పరిధిలో ప్రజాబాట కార్యక్రమ నిర్వహణకు అధికారులు ప్రణాళికలు ఖరారు చేశారు. ప్రజాప్రతినిధులను సైతం ఆహ్వానించి, వారి భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకే..
వినియోగదారులకు అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే వినియోగదారులు సంబంధిత అధికారులను, ఉద్యోగులను సంప్రదించడం, ఫిర్యాదులు చేయడం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. విద్యుత్ శాఖ అమలు చేస్తున్న నూతన సాంకేతిక విధానాల వినియోగం గురించి కూడా వివరిస్తారు. విద్యుత్ బిల్లుల ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులు, విద్యుత్ వినియోగంపై రైతులు తీసకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఫిర్యాదు చేసే విధానం, సోలార్ విద్యుత్ ఏర్పాటు, రాయితీల వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాబాట కార్యక్రమం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమైనది. ప్రజల ముంగిటకు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు వస్తారు. వారికి విద్యుత్ సమస్యలు వివరించి పరష్కరించుకోవాలి. విద్యుత్ శాఖ అందించే సేవలపై అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
శ్రీనివాసా చారి, ఎస్‌ఈ


