బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..
●2028లో మళ్లీ
●ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పువ్వాడ
రఘునాథపాలెం: గ్రామాల సమగ్రాభివృద్ధికి బాటలు వేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైనందున 2028 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని మంచుకొండ, పంగిడి, ఈర్లపూడి, రాంక్యాతండా, బద్ధ్యాతండా, పరికలబోడు తండా, జింకలతండా పంచాయతీల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ శనివారం ఆయన ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చెరువులను పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, ప్రతీ జీపీలో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నిర్మించామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు చేర్చామని వివరించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గ్రామాలభివృద్ధి నిలిచిపోయినందున జీపీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా, ఏకగ్రీవమైన కాంగ్రెస్ స్థానాలన్నీ ఒత్తిళ్లు, బెదిరింపులతో సాధించుకున్నవేనని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు శాంత, మందడపు మాధవరావు, నర్సింహారావు, తారాచంద్, భూక్యా లక్ష్మణ్‌నాయక్, చెరుకూరి ప్రదీప్, కంపాటి రవి, సీపీఐ, సీపీఎం నాయకులు షేక్ జానీమియా, నవీన్‌రెడ్డి, పగడాల మల్లేశం, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.


