స్నైపర్ గన్‌తో జింకల వేట
● ఆర్మ్స్, వైల్డ్‌లైఫ్ నేరాల కింద చార్జీషీట్ దాఖలు ● జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్
ఖమ్మంవ్యవసాయం: సత్తుపల్లిలోని అర్బన్ పార్క్‌ల్లో వన్యప్రాణుల వేటకు సంబంధించి సమగ్ర విచారణ అనంతరం నిందితులను గుర్తించి రిమాండ్‌కు తరలించామని జిల్లా అటవీఅధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ తెలిపారు. ఖమ్మంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పార్కులోకి కొందరు తుపాకులతో వచ్చి ఐదు జింకలు వేటాడి చంపినట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయడమే కాక సత్తుపల్లి ఎఫ్‌డీఓ, ఎఫ్‌ఆర్‌ఓ ఆధ్వర్యాన విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలుత సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పార్క్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ, ఉదయం వాకింగ్‌కు వచ్చే శ్రీరాంప్రసాద్‌ను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు.
స్నైపర్ గన్‌తో వేట
విచారణ కొనసాగిస్తుండగా అశ్వారావుపేట నుంచి మెచ్చా రఘు కూడా వేటలో పాల్గొన్నట్లుగా తేలిందని డీఎఫ్‌ఓ చెప్పారు. ప్రొఫెషనల్ షూటర్ల వద్ద మాత్రమే ఉండే స్నైపర్ గన్‌తో రఘు రెండో గేట్ నుంచి రాగా, మెయిన్ గేట్ నుంచి వాహనంలో కుంజ భరత్ వచ్చినట్లు బయటపడిందన్నారు. దీంతో రఘు, వాహనం యజమాని భరత్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడమే కాక పూర్తిస్థాయి విచారణ కోసం కొత్తగూడెం ఎస్పీ, డీఎఫ్‌ఓకు సమాచారం ఇచ్చినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. అలాగే, ఆర్మ్స్ యాక్ట్ కింద చార్జిషీటు దాఖలు కోసం ఖమ్మం ఎస్పీ సునీల్‌దత్‌కు సమాచారం ఇచ్చిన తాము వైల్డ్‌లైఫ్ నేరాల కింద చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, మెచ్చా రఘు వద్ద 2021–22 నుంచి తుపాకులు ఉన్నాయని తెలిపారు. గత నెల 24న అర్బన్‌పార్కుకు రాగా, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే గన్‌ను పోలీసులకు సరెండర్ చేశాడన్నారు. ప్రస్తుతం గన్ పోలీసుల వద్దే ఉన్నందున వారు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షల అనంతరం చార్జీషీట్ దాఖలు చేసే అవకాశముందని తెలిపారు. కాగా, ఖమ్మం అటవీ రేంజ్‌లోనూ తమిళనాడు వాసి తుపాకీ కలిగి ఉండగా అరెస్ట్ చేశామని డీఎఫ్‌ఓ వివరించారు. ఈ సమావేశంలో అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు వీరభద్రరావు, రాధిక, స్నేహలత పాల్గొన్నారు.


