50 ఏళ్ల తర్వాత కలయిక
ఖమ్మంసహకారనగర్: వారంతా 50 సంవత్సరాల క్రితం ఒకేచోట శిక్షణ పొందారు. అంతేకాదు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (టీటీసీ)కు సంబంధించి ఖమ్మం జిల్లాలో వారిదే మొదటి బ్యాచ్. వీరంతా ఉపాధ్యాయులుగానే కాకుండా ప్రభుత్వ రంగంలో వివిధ విభాగాల్లో సుదీర్ఘకాలం సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందారు. వారంతా ఒక చోట కలుసుకుని, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1975–76లో టీటీసీ శిక్షణ మొదలు కాగా తొలి బ్యాచ్ అ‘పూర్వ’కలయిక ఆదివారం నగరంలోని శుభవేళ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. ఇందులో కొందరు ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభమై జాయింట్ కలెక్టర్ స్థాయికి ఎదిగిన వారు కూడా ఉండటం గమనార్హం. కార్యక్రమానికి అలపాటి అంకుప్రసాద్ అధ్యక్షత వహించగా నాటి టీటీసీ బ్యాచ్ ప్రముఖులు బూర్లె లక్ష్మీనారాయణ, ఎస్.కామేశ్వరరావు, ఎ.రాఘవరావు, కనపర్తి వెంకటేశ్వర్లు, పి.కోటేశ్వరరావు, ఎ.రవీంద్రబాబు, ఫణీంద్రకుమారి, బక్రుద్దీన్, హెచ్‌ఎల్ ప్రసాద్‌బాబు, ముదిగొండ శ్రీరామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


