రాజుపేటలో ‘రాజు’ ఎవరో..?
● ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల గ్రామంలో పోరు రసవత్తరం ● సర్పంచ్ బరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : కూసుమంచి మండలం రాజుపేట పంచాయతీలో సర్పంచ్ పోరు రసవత్తరంగా ఉంది. ఇది మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల స్వగ్రామం. ఈ పంచాయతీ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. 1995లో పెరికసింగారం పంచాయతీ నుంచి విడిపోయి రాజుపేట గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏకగ్రీవం కాలేదు. అయితే ఈ దఫా సర్పంచ్ బరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామం కావడం, ఇది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఉండడంతో ఇక్కడ విజయం ఏ పార్టీ మద్దతుదారుడిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..?
రాజుపేట గ్రామంలో 756 మంది ఓటర్లు ఉన్నారు. 1995 నుంచి పరిశీలిస్తే ఈ గ్రామంలో తొలుత సర్పంచ్‌గా కంపసాటి గోవింద్ (సీపీఎం), ఆ తర్వాత దారావత్ వెంకట్రాం (టీడీపీ), మోదుగు జ్యోతి (టీడీపీ), కందాల సురేందర్‌రెడ్డి (కాంగ్రెస్), వాసంశెట్టి అరుణ (కాంగ్రెస్) సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ మద్దతుతో కొర్రా రమేష్, బీఆర్‌ఎస్ బలపర్చిన బానోతు మహేష్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా కొర్రా నాగులు పోటీలో ఉన్నారు. 8 వార్డుల్లో ఏడు వార్డులకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు పోటీలో నిలిచారు. 8వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పాటు మరో అభ్యర్థి బరిలో ఉన్నారు. రెండో విడతలో భాగంగా ఈనెల 14న ఇక్కడ పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ శనివారం ముగియడంతో ఈ పంచాయతీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మద్దతు, మరో వైపు మంత్రి మద్దతు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఈగ్రామ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది.


