వనమా.. 18ఏళ్లు జీపీలో
పాల్వంచరూరల్: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గ్రామపంచాయతీ వార్డుసభ్యుడిగా, సర్పంచ్‌గా గెలవడంతో పాటు మంత్రి స్థాయికి ఎది గారు. పాల్వంచ మేజర్ గ్రామపంచాయతీలో 18ఏళ్ల పాటు వార్డు సభ్యుడిగా, సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవాలు ఆయన మాటల్లోనే.. పాల్వంచ గ్రామపంచాయతీ మొదటి వార్డు నుంచి సభ్యుడిగా పోటీ చేసినప్పుడు రూ.100 నామినేషన్ ఫీజు ఉండేది. ఆ తర్వాత సర్పంచ్‌గా బరిలోకి దిగితే అప్పట్లో వార్డు సభ్యుల ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవాల్సి ఉండేది. మెజార్టీ సభ్యులు జలగం వెంగళరావు వర్గంలోని నావైపే మొగ్గు చూపినా చేకూరి కాశయ్య వర్గంగా రేఖ సత్యం కూడా పోటీ పడ్డారు. అయినా నేనే గెలిచా. ఆ తర్వాత రకరకాల పదవులు నిర్వర్తించి 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచా. 2008లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించా. నేను సర్పంచ్‌గా చేసిన అభివృద్ధికి 1980లో అప్పటి గవర్నర్ కుముద్‌బేన్‌జోషీ చేతుల మీదుగా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు అందుకోవడం మరిచిపోలేని అనుభూతి.


