మెచ్చా.. రెండు సార్లు సర్పంచ్
అశ్వారావుపేట: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం సర్పంచ్‌గానే మొదలైంది. దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెం సర్పంచ్‌గా రెండు సార్లు ఎన్నికై న ఆయన 2019లో కాంగ్రెస్ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా అశ్వారావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మెచ్చా వెల్లడించిన వివరాలు.. రెండు సార్లు టీడీపీ బలపరచిన అభ్యర్థిగా సర్పంచ్‌గా గెలుపొందా. మొదట 1995లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచినా, రెండో సారి ఏకగ్రీవమైంది. ఒకే గ్రామంలో ఓటర్లు ఉండటంతో కాలి నడకనే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసేవాళ్లం. అప్పట్లో మైకులు, ప్లెక్సీలు లేకపోగా బ్యానర్లు కూడా కట్టలేదు. వాల్‌పోస్టర్లు సత్తుపల్లి నుంచి తెచ్చుకుని ఇంటింటికీ అతికించేవాళ్లం. అవి కూడా పార్టీలో ఎవరైనా వాళ్ల డబ్బుతోనే ముద్రించి ఇచ్చేవాళ్లు. ప్రచారంలో పాల్గొనే పార్టీ కార్యకర్తలకు, గ్రామంలో అంతా తెలిసిన వాళ్లే కావడంతో ఏ వీధిలో వాళ్లు అక్కడే అభ్యర్థితో ప్రమేయం లేకుండా వాగ్దానం తీసుకుని ఓట్లు వేయించేవారు. ఒక్క సారి మాత్రమే నేను వెళ్తే మిగతా సమయమంతా పార్టీ వాళ్లే చూసుకునేవారు. అప్పట్లో బ్యాంకు ఖాతా నిబంధన లేకపోగా, ఖర్చు వివరాలు కూడా అడిగే వారు కాదు.


