జమలాపురంలో అభిషేకం, నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

జమలాపురంలో అభిషేకం, నిత్యకల్యాణం

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

10 శాతమైనా పెంచండి

రైల్వేలైన్‌ భూసేకరణపై నిర్వాసితుల వినతి

కారేపల్లి: డోర్నకల్‌–భద్రాచలం రోడ్డు రైల్వే మార్గంలో డబ్లింగ్‌ పనుల కోసం సేకరించనున్న భూములపై నిర్వాసితులతో ఈ అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజేశ్వరి శనివారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. సింగరేణి గ్రామానికి చెందిన నిర్వాసితులు హాజరుకాగా, ఆమె వ్యవసాయ భూమిఎకరానికి రూ.19లక్షలు, ఇంటి స్థలం గజానికి రూ.6,300 పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూసేకరణకు నిర్ణయించిన ధర ఇదేనని చెప్పగా, నిర్వాసితులు అంగీకరించలేదు. నాన్‌ ఏజెన్సీ భూముల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుని కనీసం పది శాతమైన పెంచాలని కోరారు. ఇప్పటికి రెండు సార్లు సమావేశం ఏర్పాటుచేసినా ఫలితం లేనందున, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ సమక్షాన ఇంకోసారి భేటీ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వారంలోగా నిర్వహించే సమావేశంలో నిర్ణయం తెలపాలని అధికారులు సూచించారు.

పీహెచ్‌సీ పనులు

వేగంగా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్‌ శ్రీజ

నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాదారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతు పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ ఆదేశించారు. మండలంలోని చెరువుమాధారం, నేలకొండపల్లి ఆస్పత్రులను శనివారం ఆమె తనిఖీ చేశారు. తొలుత చెరువుమాదారం పీహెచ్‌సీలో పనులను పరిశీలించగా, అసంపూర్తి పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. ఆతర్వాత నేలకొండపల్లి సీహెచ్‌సీలో రికార్డులు పరిశీలించి వైద్యసేవలపై చికిత్స పొందుతున్న వారితో ఆరా తీశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌గౌడ్‌, తహసీల్దార్‌ పి.రాంప్రసాద్‌, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ శివ, పీఆర్‌ ఏఈ ప్రసాద్‌, వైద్యాధికారులు మంగళ, కె.రాజేష్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పాడైన పంచదార వేలం

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని గోదాముల్లో వినియోగానికి పనికిరాకుండా పోయిన చక్కెరను వేలం వేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శ్రీలత తెలిపారు. ఖమ్మం అర్బన్‌లో 0.538 మెట్రిక్‌ టన్నుల చక్కెరను ఈనెల 8న, నేలకొండపల్లిలో 5.013 మెట్రిక్‌ టన్నులు 9న, ఏన్కూరులో 0.067 మెట్రిక్‌ టన్నులు 10వ తేదీన ఉదయం వేలం వేస్తామని వెల్లడించారు. అలాగే, వైరాలో 12.523 మెట్రిక్‌ టన్నుల చక్కెను 9న, సత్తుపల్లిలో 5.701 మెట్రిక్‌ టన్నులను 10న సాయంత్రం 4 గంటలకు వేలం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేలం ధర నిర్ణయించనుండగా, దక్కించుకున్న వారే ఎత్తడం, శుభ్రపరిచే ఖర్చులు భరించాల్సి ఉంటుందని డీఎం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement