● సోమవరం వద్ద ప్రవేశానికి అనుమతి ● రెండు రోజులుగా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై రాకపోకలు
వైరా: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఖమ్మంలో కాకుండా వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి ఈనెల 2వ తేదీ నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వస్తున్న వాహనాలు వైరా దాటాక సోమవరం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే పైకి చేరుకుంటున్నాయి. ఫలితంగా దేవరపల్లి వరకు జాతీయ రహదారిపై రాకపోకలు ఊపందుకుంటున్నాయి.
162కి.మీ. నిడివితో నిర్మాణం..
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల నిడివితో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ హైవే ఖమ్మం జిల్లాలోనే 105 కి.మీ. మేర ఉంది. అయితే, ఖమ్మం సమీపాన మున్నేటిపై వంతెన, ధంసలాపురం వద్ద రైల్వేలైన్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సమయాన వైరా వద్ద హైవేపైకి వాహనాలను అనుమతించినా ప్రమాదాలు జరగడంతో నిలిపివేశారు. కాగా, మున్నేరు, రైల్వేలైన్‌పై బ్రిడ్జిల నిర్మాణ పనులకు ఇంకా సమయం పట్టనుండడంతో రద్దీని నియంత్రించేలా వైరా మండలం సోమవారం వద్ద హైవేపైకి వాహనాలను అధికారికంగా అనుమతిచాలని నిర్ణయించారు. ఈవిషయమై అవగాహన కల్పించేలా ఖమ్మం నుంచి వైరా వరకు పలు ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు.
అంతా సిద్ధం..
రెండు బ్రిడ్జిలు మినహా హైవే నిర్మాణం దాదాపు పూర్తయింది. డివైడర్ల నిర్మాణం పూర్తికాగా పూల మొక్కలు నాటడమే కాక వేగ నియంత్రణను తెలిపేలా సైన్ బోర్డుల ఏర్పాటు, రెస్ట్ రూమ్‌లు, పెట్రోల్ బంక్‌లు, వైద్య సదుపాయం కోసం కల్లూరు మండలం లింగాల సమీపాన గదులు నిర్మించారు. అంతేకాక టోల్ రుసుము వసూలుకు గేట్లు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వేళ వెలుగుల కోసం సోలార్ లైట్లు బిగించారు. ఈనేపథ్యాన హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం చేరుకుంటున్న వాహనాలు.. ఆపై 20 కి.మీ. ప్రయాణిస్తే వైరా మండలం సోమవరం వద్ద ఎంట్రీ పాయింట్ వస్తుంది. అక్కడ హైవేపైకి చేరితే దేవరపల్లి వరకు సులువుగా వెళ్లే అవకాశం ఉండడంతో వాహనదారులు వినియోగించుకుంటున్నారు.


