ఖమ్మంగాంధీచౌక్: పశ్చిమ, తూర్పు దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని ఉమ్మడి జిల్లా ఆర్‌సీఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ పేర్కొన్నారు. ఈనేపథ్యాన శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఖమ్మంలో శనివారం ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన రన్ ఫర్ జీసస్ పేరిట శాంతి ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ వద్ద ప్రారంభమైన ర్యాలీని ఉద్దేశించి ప్రకాష్ మాట్లాడుతూ యుద్ధంతో అనేక దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొన్నిచోట్ల నిత్యావసరాలు లభించని పరిస్థితి నెలకొందన్నారు. ఈమేరకు యుద్ధం ముగిసి శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కాగా, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ తీర్పుపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరి దయాకర్‌రెడ్డి మాట్లాడగా, ర్యాలీ మయూరిసెంటర్, పాత బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు రమేష్, టి.శౌరి, సూరేపల్లి ఐజక్, విజయ్‌కుమార్, పల్లా రవికిషోర్, జాకబ్, ముత్తమాల ప్రసాద్, కొమ్ము ప్రసాద్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌సీఎం బిషప్ సగిలి ప్రకాష్


