పల్లె నుంచే ప్రథమం
ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా విజయాలు జాబితాలో మాజీ మంత్రులు వనమా, రాంరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి, మెచ్చా, తాటి కూడా..
ఇల్లెందు: ‘ఆనాడు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బరిలోకి దిగిన నా నామినేషన్ ఫీజు పార్టీ చెల్లించగా.. ఇతరత్రా పైసా ఖర్చు పెట్టకుండా గెలిచాను’ అని గుమ్మడి నర్సయ్య వెల్లడించారు. ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన సర్పంచ్‌గా తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇల్లెందు తాలూకాలోని టేకులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా 1981 ఎన్నికల్లో పోటీ చేశా. అప్పటి ప్రజాపంథా తరఫున బరిలోకి దిగగా, నామినేషన్ ఫీజు కూడా పార్టీయే చెల్లించింది. ఆ ఎన్నికల్లో నాతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఉసిరికాయలపల్లి ఏరియా ఓట్లు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు పోల్ కాగా టేకులగూడెం ఏరియా ఓట్లు నాకు రావడంతో 40 ఓట్ల మెజార్టీతో గెలుపొందా. రెండేళ్ల పాటు టేకులగూడెం గ్రామపంచాయతీకి ప్రభుత్వం నుంచి పైసా విడుదల కాలేదు. ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున ఇంటి పన్నులు వసూలు చేయొద్దని ఆనాడు పార్టీలు పిలుపునివ్వడంతో రాబడి నిలిచిపోయింది. దీంతో పంచాయతీ సభలు, సమావేశాలకే పరిమితం కావాల్సి వచ్చేది. సర్పంచ్‌గా రెండేళ్లు పూర్తి కాకముందే 1983లో పార్టీ నన్ను ఎమ్మెల్యేగా పోటీలో నిలిపింది. నేను సర్పంచ్‌గా బరిలో ఉన్నప్పుడు ఇంటింటి ప్రచారం మినహా కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు, మైకుల హోరు లేదు. కానీ ఇప్పుడు రూ.లక్షలు ఖర్చు చేస్తే తప్ప సర్పంచ్‌గా ఎన్నికయ్యే అవకాశం దక్కడం లేదు. అంతేకాక ఆనాటి పెద్ద పంచాయతీలు ఇప్పుడు పదికి పైగా విడిపోయాయి.
సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభం


