పరిశ్రమల బలోపేతానికి కృషి
● గ్రానైట్ పరిశ్రమ పునరుద్ధరణకు కార్యాచరణ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం అర్బన్: జిల్లాలో గ్రానైట్ రంగం నిలబడితే వేలాది కుటుంబాల జీవనోపాధి సుస్థిరంగా ఉండనున్నందున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పరిశ్రమల అభివృద్ధిపై సమగ్ర చర్యలు తీసుకునేలా త్వరలోనే ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖమ్మం ఖానాపురంలోని పారిశ్రామిక ప్రాంతంలో గ్రానైట్ యూనిట్లను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఉత్పత్తి, ప్రాసెసింగ్ కార్యకలాపాలను పరిశీలించి నిర్వాహకులు, కార్మికులతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు, ఎగుమతి సమస్యలు, రవాణా తదితర అంశాలపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడారు. గ్రానైట్ పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం ముందడుగు వేసిన నేపథ్యాన విస్తరణ, కార్మికుల సంక్షేమం, వసతుల మెరుగుదలకు జిల్లా యంత్రాంగం సహరిస్తుందని తెలిపారు. పరిశ్రమలు బలోపేతమైతే ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. కాగా, గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు వాతావరణ కాలుష్యం జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సీతారాం నాయక్, ఆర్‌డీఓ నరసింహారావు, టీజీఐఐసీ డీఈ స్మరత్‌చంద్ర, జేఈ శివకుమార్, తహసీల్దారు సైదులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, రాజకీయ ప్రతినిధులతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాం గోడలపై పగుళ్లకు మరమ్మతు చేయించాలని సూచించారు. ఉద్యోగులు ఎం.ఏ.రాజు, లఖన్‌నాయక్, లలిత, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
అవినీతిపై ఫిర్యాదు చేయండి
ఖమ్మంక్రైం: ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా అవినీతి నిరోధక శాఖ రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్ విడుదల చేసి మాట్లాడారు. టోల్‌ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ డీఎస్పీ 91543 88981, హైదరాబాద్ ప్రధాన కార్యాలయం 91543 88989కు లేదా వాట్సాప్ నంబర్ 94404 46106 ద్వారా ఫోన్ చేయొచ్చని సూచించారు.


