ఏడు నెలలుగా ఇక్కట్లే..
వేతనాలు అందక
104 ఉద్యోగుల అవస్థలు
సేవలు రద్దు చేసి ఇతర విభాగాల్లో వినియోగం
ఉమ్మడి జిల్లాలో 143 మంది సిబ్బంది ఆవేదన
ఉన్నతాధికారులు చొరవ చూపాలి
గతంలో వెలుగొంది.. క్రమంగా కనుమరుగై..
ఖమ్మంవైద్యవిభాగం : గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు అందించిన 104 వ్యవస్థకు గత ప్రభుత్వం మంగళం పలికింది. దీంతో వాహనాల్లో పనిచేసిన ఉద్యోగులను పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు. వారి సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం.. వేతనాల విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఏడు నెలలుగా ఏడుపే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 143 మంది ఉద్యోగులు వివిధ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 85 మంది పనిచేస్తుండగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు కలిపి 43 మంది డీఎంఈ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా 42 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. వీరందరికీ గత ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు. భద్రాద్రి జిల్లాలో 58 మంది పనిచేస్తుండగా వారికి 8 నెలల జీతాలు రావాల్సి ఉంది. వీరిలో 35 మంది డీఎంఈ పరిధిలో, 23 మంది వైద్యారోగ్య శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 23 వాహనాల ద్వారా నిరాటంకంగా లక్షలాది మందికి సేవలందించిన 104 సిబ్బంది.. ఆ వాహనాలను తొలగించిన తర్వాత దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.
చాలా కాలంగా సకాలంలో జీతాలు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది ఉద్యోగులకు కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పు చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా ఉద్యోగులకు ఏడు నెలలుగా, భద్రాద్రి జిల్లా వారికి ఎనమిది నెలలుగా వేతనాలు రావాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చొరవ చూపి వెంటనే జీతాలు చెల్లించేలా చూడాలి. – మన్మథరావు,
104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షడు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశారు. ముఖ్యంగా వైద్యం అందక నిరుపేదలు పడుతున్న కష్టాలను గమనించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన వెంటనే 104 వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ గ్రామానికి వాహనం వెళ్లి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఆయన ఉన్నంత కాలం గ్రామాల్లో 104 ద్వారా రోగులకు వైద్య సేవలతో పాటు మందులు కూడా సక్రమంగా అందేవి. ఆ తర్వాత 104 సేవలకు క్రమంగా గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం ఈ సేవలను పూర్తిగా రద్దు చేసి, వాహనాలను వేలం ద్వారా విక్రయించింది. దీంతో 104 సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయి. కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డీఎంఈ ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు.
ఏడు నెలలుగా ఇక్కట్లే..


