‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ రెండో దశకు రెడీ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం పెంచేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమం రెండో దశ అమలుకు సిద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉద్యోగులతో శనివారం సమావేశమైన కలెక్టర్ ఈసీఆర్ మొదటి దశను విజయవంతంగా అమలు చేయడంపై అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, విద్యార్థుల ప్రగతి ఆధారంగా రెండో దశ కోసం స్టడీ మెటీరియల్ సిద్ధం చేశామని తెలిపారు. వెనకబడిన విద్యార్థులకు బేసిక్స్ మరింత సులువుగా నేర్పించేలా ఒక మెటీరియల్, ప్రగతి సాధించిన విద్యార్థులకు వైవిధ్యమైన పదాలు నేర్పించేలా ఇంకొకటి రూపొందించామని చెప్పారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ప్రారంభించిన మొదటి వారంలో 11శాతం విద్యార్థులే వాక్యాలు చదివారని, గత బుధవారం ఆ సంఖ్య 36శాతానికి చేరిందన్నారు. రెండో దశలో భాగంగా పదాలు చదివే సామర్థ్యం ఉన్న పిల్లలతో వాక్యాలు, అక్షరాలు చదివే పిల్లలతో పదాలు చదివించేలా తర్పీదునివ్వాలని సూచించారు. బట్టీ విధానంలో కాకుండా ప్రతీ పదం శబ్దం ఎందుకు వస్తుందో వివరిస్తూ నేర్పించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


