శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుసామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అంతేకాక పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీసేవ చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
విత్తన మక్కల సాగుకు అగ్రిమెంట్ తప్పనిసరి
కొణిజర్ల: విత్తన మొక్కజొన్న సాగు చేయించే కంపెనీల ప్రతినిధులు రైతులకు తప్పనిసరిగా అగ్రిమెంట్ ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని తనికెళ్ల రైతు వేదికలో మొక్కజొన్న కంపెనీల ఏజెంట్లతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈనెల 10వ తేదీ దాటాక ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు వేయించొద్దని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు వారానికో సారి పంటను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వాలే తప్ప గత ఏడాది మాదిరి ఇబ్బంది చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, పంట కోసి లోడింగ్ చేసిన పది రోజుల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయించాలని సూచించారు. అనంతరం గ్రామంలో సాగవుతున్న సీడ్ మొక్కజొన్నను డీఏఓ పరిశీలించారు. వైరా ఏడీఏ కరుణశ్రీ, ఏఓ బాలాజీ, ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓలు, ఏజెంట్లు పాల్గొన్నారు.
‘నవోదయ’లో
పూర్వవిద్యార్థుల సమ్మేళనం
కూసుమంచి: మండలంలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 2000–2007 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి వివిధ హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. చదువుకున్నప్పటి స్మృతులను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. ఈకార్యక్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రారంభించి మాట్లాడుతూ విద్యాలయకు పూర్వ విద్యార్థులు వెన్నుముక లాంటివారని తెలిపారు. ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడటం గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గద్దర్‌తో బాలసుబ్రహ్మణ్యంకు పోటీ అనవసరం
సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల
ఇల్లెందు: పీడిత ప్రజల కోసం తుది వరకు పోరాడిన గద్దర్ ఆశయ సాధనకు తాను నడుం బిగించానని ఆయన కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల తెలిపారు. ఇల్లెందులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు సందర్భంగా గద్దర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోందని చెప్పారు. కానీ గద్దర్–బాలసుబ్రహ్మణ్యం మధ్య పోటీ అనవసరమని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలోని 524 మంది సభ్యులకు గతంలో ఆరు నెలలకోసారి వేతనాలు అందేవని.. తాను బాధ్యతలు తీసుకున్నాక సమస్య తీర్చానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ఫలాలు పొందుతున్న ప్రజలు గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని వెన్నెల కోరారు. నాయకులు గోచికొండ శ్రీదేవి, మడుగు సాంబమూర్తి, గోచికొండ సత్యనారాయణ పాల్గొన్నారు.
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం


