ప్రచార రంగంలోకి..
రెండో విడత షురూ..
రెండో విడత అభ్యర్థుల ప్రచారం కూడా మొదలు.. ఓటర్లను ఆకట్టుకునేలా అడుగులు మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు 9వరకు గడువు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలకఘట్టమైన నామినేషన్ల దాఖలు ముగిసింది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసి బరిలో ఉండే అభ్యర్థులు తేలడంతో ప్రచారం జోరందుకుంది. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం ముగియగా పోటీలో ఎవరెవరు మిగిలారో తేలిపోయింది. ఇక మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 9వరకు గడువు ఉంది. ఈమేరకు మొదటి, రెండో విడత అభ్యర్థుల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను అభ్యర్థులు వినియోగించుకుంటున్నారు. మూడో విడతలో తప్పక పోటీలో ఉంటామనుకునే సర్పంచ్, వార్డు అభ్యర్థులు కూడా ఓటర్లను కలుస్తున్నారు.
మొదటి విడత బరిలో 476మంది
మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగే చోట్ల అభ్యర్థుల సంఖ్య తేలింది. మొదటి విడతగా కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 192 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 1,142, 1,740 వార్డుస్థానాలకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3న ఉపసంహరణ గడువు ముగియగా ఏకగ్రీవాలు మినహా 172 సర్పంచ్ స్థానాల్లో 476 మంది బరిలో మిగిలారు. ఇక 1,740 వార్డులకు గాను రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 323 ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా 1,415 వార్డుల్లో 3,275 మంది పోటీలో ఉన్నారు.
రెండో విడత బరిలో వీరే..
రెండో విడత ఎన్నికలు కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో జరగనున్నాయి. ఆయా మండలాల్లోని 183 సర్పంచ్ స్థానాలకు 1,055మంది, 1,685 వార్డులకు 4,160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినా పార్టీల మద్దతుదారులే బరిలోకి దిగారు. ఈ నేపథ్యాన పార్టీ సూచించిన అభ్యర్థి కాక ఇంకొందరు కూడా నామినేషన్లు వేయగా వారితో ఉపసంహరింపచేసేలా జరిపిన మంతనాలు కొంత మేరకే ఫలించాయి. ఇక మూడో విడత ఎన్నికలు జరిగే 191 సర్పంచ్ స్థానాలకు 1,025, 1,742 వార్డుసభ్యుల స్థానాలకు 4,085 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఈనెల 9వ తేదీతో ఉపసంహరణలు ముగిస్తే పోటీలో మిగిలే అభ్యర్థుల సంఖ్య తేలుతుంది.
పోటాపోటీగా ప్రచారం
మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో అభ్యర్థుల ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. తమను గెలిపిస్తే గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను వివరించడమే కాక వ్యక్తిగతంగా ఏమేం ప్రయోజనాలు ఉంటాయో చెబుతూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. పార్టీ గుర్తులు లేకపోగా, ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులను ఓటర్లకు పరిచయం చేస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాక తమకు కేటాయించిన గుర్తులు జనంలోకి వెళ్లేలా స్టిక్కర్లు, కరపత్రాలే కాక వాల్‌పోస్టర్లు ముద్రించడంతో పాటు మైకులతో ఆటోలు, రిక్షాల ద్వారా ప్రచారం హోరెత్తిస్తున్నారు. మొదటి విడత ఎన్నికల ప్రచార గడువు 9వ తేదీన ముగియనుండడంతో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు.
రెండో విడత ఎన్నికలు ఈనెల 14న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో శనివారం రాత్రి నుంచే అభ్యర్థుల ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాల్లో పార్టీ నేతల సూచనలతో వ్యూహాలకు పదును పెడుతూ వినూత్న రీతిలో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ దశ అభ్యర్థుల ప్రచార గడువు 12వ తేదీ ఉన్నందున ఆరు రోజుల్లో ఓటర్లను ఒకటికి రెండు సార్లు కలవాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా, మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 9తో ముగియనున్నప్పటికీ పోటీలో తప్పక ఉంటామనుకున్న అభ్యర్థులు ఓటర్లను కలుస్తున్నారు. గుర్తు కేటాయించాక మరోసారి వస్తామని చెబుతూ తమకే ఓటు వేసేలా మాట తీసుకుంటున్నారు.
ప్రజల్లోకి వెళ్తున్న మొదటి విడత అభ్యర్థులు


