‘తెలంగాణ విజన్’ వేదికపై కేఎంసీ!
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఖమ్మం నగర పాలకసంస్థలో మాత్రమే విజయవంతంగా అమలవుతున్న పథకాలు, పనులను తెలంగాణ విజన్–2047 వేదికపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య వివరించారు. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ‘తెలంగాణ విజన్ 2047– జర్నీ ఫార్వర్డ్’ పేరిట సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ ఖమ్మంలో 24 గంటల తాగునీటి సరఫరా, బయోమైనింగ్ అంశాలను వెల్లడించారు. బయోమైనింగ్ ద్వారా డంపింగ్‌యార్డ్‌లో ఎనిమిదెకరాల స్థలాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటడం, మరో 12 ఎకరాల స్థలంలో వ్యర్థాలను శుభ్రం చేయించినట్లు తెలిపారు. అంతేకాక 24 గంటల తాగునీటి సరఫరా కోసం రోటరీనగర్‌లో పైలట్‌గా అమలుచేయనున్న అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ కూడా పాల్గొన్నారు.
తాగునీటి సరఫరా, బయోమైనింగ్ వివరాలు వెల్లడించిన కమిషనర్ అభిషేక్


