అటవీ భూముల ఆక్రమణను కట్టడి చేయాలి
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలోని అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం కాల్వల నిర్మాణానికి సేకరించే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా గిరిజన కార్పొరేటివ్ సొసైటీ వద్ద అందుబాటులో ఉన్న వంద ఎకరాల బదిలీకి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అయితే, ఈ భూమిని గుర్తించి 15 రోజులు గడిచినా పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేయర్ల ద్వారా సోమవారం నాటికి భూబదలాయింపు పూర్తి కావాలని ఆదేశించారు. పోడు పట్టా పొందిన కొందరు రైతులను మభ్యపెట్టి సమీపాన అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నందున రెవెన్యూ, అటవీ అధికారులు అప్రమత్తంగా ఉంటూ భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని సూచించారు. అలాగే, పోడు భూముల పట్టా ఉన్నవారు అటవీ జంతువుల వేటకు పాల్పడినా, భూఆక్రమణకు యత్నించినా గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని కలెక్టర్ తెలిపారు. సత్తుపల్లి అర్బన్ పార్క్ నుంచి జింకలు బయటకు రాకుండా ప్రహరీ ఎత్తు పెంచడంతో పాటు నీలాద్రి, వెలుగుమట్ల, పులిగుండాల అర్బన్ పార్క్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, కోతుల కట్టడికి రోడ్డుపై ఆహార పదార్థాలు వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ గిరిజనులు సాగుచేసే భూములకు ప్రభుత్వం అందించిన పోడు పట్టాలు ఎట్టి పరిస్థితుల్లో విస్తరించడానికి వీలు లేదని తెలిపారు. ఎవరైనా సమీపంలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మహనీయుల జీవితం ఆదర్శం
ఖమ్మంసహకారనగర్: మహనీయుల జీవితాలు అందరికీ ప్రేరణగా, ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ అనుదీప్, , అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ నివాళులర్పించగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, ఏడీ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విగ్రహం ఏర్పాటు పనులు పరిశీలన
కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. కలెక్టరేట్ కు మరింత ఆకర్షణ వచ్చేలా విగ్రహం ఏర్పాటు ఉండాలని సూచించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


