ట్రాక్టర్‌లోని వరిగడ్డి దగ్ధం
ముదిగొండ: విద్యుత్ తీగలు తాకగా ట్రాక్టర్‌లోని వరిగడ్డి దగ్ధమైన ఘటన మండలంలోని వల్లభిలో గురువారం చోటుచేసుకుంది. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన ఓ రైతు నేలకొండపల్లి మండలం రాయిగూడెంలో గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్‌లో తరలిస్తున్నాడు. వల్లభి వద్ద విద్యుత్ తీగలు గడ్డిని తాకడంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వరి గడ్డి కింద వేయగా.. అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు.
లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని కాచిరాజుగూడెం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో మునగాల వీరభద్రం(55) అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా బలపాలకు చెందిన వీరభద్రం మారెమ్మతల్లి ఆలయం వద్ద జరిగిన వేడుకకు హాజరై వెళ్తున్నాడు. మార్గమధ్యలో కాచిరాజుగూడెం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ ఎం.రాజు తెలిపారు.
కుక్కల గుంపు రావడంతో ఆటోడ్రైవర్..
ఖమ్మంక్రైం: రహదారిపై వెళ్తున్న ఆటోపైకి కుక్కల గుంపు రావడంతో వాటిని తప్పించే క్రమాన బ్రేక్ వేయగా ఆటో బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. వెంకటగిరి క్రాస్ రోడ్డు ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇమామ్‌పాషా(43) గురువారం తుమ్మలగడ్డ నుంచి వెళ్తుండగా ప్రకాష్‌నగర్ సమీపాన గుంపుగా ఉన్న కుక్కలు ఎగబడ్డాయి. వీటిని తప్పించేందుకు బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఇమామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన సోదరుడు సర్దార్ పాషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడు..
చింతకాని: మండలంలోని నేరడకు చెందిన కంచం డేవిడ్(20) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామంలోని స్నేహితుడి ఇంట్లో డేవిడ్ గురువారం విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


