సంగ్రామం
అభ్యర్థుల లెక్క తేలింది..
మిగిలింది ప్రచారమే
19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
బరిలో 489 మంది అభ్యర్థులు
తొలిదశలో 173 సర్పంచ్, 1,520 వార్డు స్థానాలకు ఎన్నికలు
ఊపందుకున్న
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సంగ్రామం ఊపందుకుంది. మూడు విడతల్లో ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో సందడి షురూ అయింది. మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో అభ్యర్థుల ఉపసంహరణలు బుధవారంతో ముగిశాయి. ఈ విడతలో వమొత్తం 192 జీపీలకు గాను 18, 1,740 వార్డులకు 220 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 173 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరుగనుండగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమను గెలిపించాలని కోరుతూ గ్రామాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ఇక మూడో విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది.
బరిలో 3,928 మంది అభ్యర్థులు
జిల్లాలో మొదటి విడతలో కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. ఇక్కడ సర్పంచ్ స్థానాలకు 1,142, వార్డులకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 489 మంది సర్పంచ్, 3,445 మంది వార్డులకు.. మొత్తం 3,928 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టుల మద్దతుతో బరిలో నిలవాలని అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల మద్దతుదారులు ఒకరి కన్నా ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో వారితో ఉపసంహరింప చేయడానికి నాయకులు రంగంలోకి దిగారు. నామినేషన్ల గడువు గత నెల 29తో ముగియగా.. అప్పటి నుంచి నామినేషన్లు వేసిన వారితో చర్చలు జరిపి చాలా మందితో ఉపసంహరణ చేయించారు. మరికొందరు బరిలోనే ఉన్నారు.
పోటా పోటీ..
మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను నాలుగు మండలాలు మొదటి దశలో ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం, వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా మండలాల్లో ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారులు బరిలో ఉన్నారు అన్ని పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల సమయంలోనే ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం.
19 జీపీలు ఏకగ్రీవం..
జిల్లాలో మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ఆహ్వానించారు. ఇందులో 19 గ్రామపంచాయతీలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవం అయ్యాయి. ఇక 1,740 వార్డులకు గాను 220 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బోనకల్ మండలంలోని కలకోట, చింతకాని మండలం రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర మండలం సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా మండలం లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, పుణ్యపురం, రఘునాథపాలెం మండలం మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములు తండా, ఎర్రుపాలెం మండలం గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 173 జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 1,740 వార్డుల్లో 220 వార్లులు ఏకగ్రీవం కాగా 1,520 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి.
1,740 పోలింగ్ కేంద్రాలు..
మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
ముగిసిన మొదటి విడత
ఉపసంహరణలు


