నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. స్వామివారికి సువర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కాగా, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు.


