తూటా దూసుకెళ్తోంది.. | - | Sakshi
Sakshi News home page

తూటా దూసుకెళ్తోంది..

Nov 29 2025 7:15 AM | Updated on Nov 29 2025 7:17 AM

రాత్రివేళ వేటాడుతున్న పలువురు ?

ఓ వేడుకలో వన్యప్రాణి మాంసం వడ్డన

ఉన్నతాధికారులకు అందిన

ఫిర్యాదుతో విచారణ

తుపాకీ శబ్దాలే కారణమా?

సత్తుపల్లిలో వన్యప్రాణులను వేటాడినట్లు జరుగుతున్న ప్రచారం

కలకలం రేపుతోంది. అర్బన్‌ పార్క్‌లో జింకలు, దుప్పులను కొందరు సైలెన్సర్‌ బిగించిన తుపాకులతో

హతమారుస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ వేడుకలో దుప్పి మాంసం వడ్డించగా విషయం బయటకు పొక్కినట్లు

సమాచారం. ఐదు వన్యప్రాణులను వేటాడినట్లు రెండు రోజుల క్రితం అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు

అందడంతో నిజమా, కాదా అని తేల్చేందుకు విచారణ చేపట్టినట్లు సమాచారం. – సత్తుపల్లి

సిబ్బందిని మచ్చిక చేసుకుని..

2022 ఫిబ్రవరిలో సత్తుపల్లిలోని 354 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్‌పార్కు ఏర్పాటైంది. పార్క్‌ను ఆనుకుని జలగంనగర్‌ కాలనీ, వేంసూరు రోడ్డు వైపు ప్రభుత్వ కార్యాలయాల మధ్య 2.5 కిలోమీటర్ల మేర ఐదు అడుగుల ఎత్తుతోనే ప్రహరీ ఉంది. ఈ ప్రాంతమే వేటగాళ్లకు కూడా కలిసొస్త్తోందని, వీరికి అటవీశాఖ సిబ్బంది కొందరు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయాన తాగునీటి కోసం వచ్చే జీవాలను సైలెన్సర్‌ బిగించిన తుపాకీతో కాలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాత్రివేళ కిందిస్థాయి సిబ్బంది ఒకరిద్దరే గస్తీ ఉండడంతో వారిని లోబర్చుకోవటం వేటగాళ్లకు సులువవుతోందని సమాచారం.

లెక్క తేలాలి..

అర్బన్‌ పార్కులో గత ఏడాది 102కు పైగా జింకలు, దుప్పులు ఉన్నట్లు అటవీశాఖ తేల్చింది. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతుండగా వచ్చే జనవరిలో మరోమారు లెక్కించనున్నారు. ఇటీవల పార్క్‌లో జింకలు, దుప్పుల మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. ఇందుకు వేటగాళ్లే కారణమా, అనారోగ్యం బారిన పడుతున్నాయా లేక పార్క్‌ నుంచి బయటకు వచ్చి వాహనాల కింద పడి చనిపోతున్నాయా అన్నది తేలాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కూడా ఐదు జింకలు మృత్యువాత పడడం గమనార్హం.

ఎప్పుడంటే అప్పుడే..

ఇటీవల ఓ వేడుకలో దుప్పి మాంసాన్ని వడ్డించారనే విషయం బయటకు రావడంతో అధికారులు ఆరా తీస్తుండగా ఒక్కో విషయం బయటపడుడుతున్నట్లు సమాచారం. ఆ వేడుక నిర్వహించిన వ్యక్తి తాను తలుచుకుంటే ఎప్పుడంటే అప్పుడు దుప్పిని వేటాడి వడ్డిస్తానని.. అది తనకు హాబీ అని చెప్పినట్లు తెలిసింది. ఇదే సమయాన పార్కులో జింకల మృతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు రావడంతో విచారణకు బృందాన్ని నియమించారు. దీంతో రెండు రోజులుగా అర్బన్‌పార్కులో జింకలను వేటాడిన ఆనవాళ్లు, రక్తపు మరకలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు.

సత్తుపల్లి అర్బన్‌పార్క్‌లోని

దుప్పులు, జింకలే లక్ష్యం

పార్కు నుంచి జింకలు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. వెనుక వైపు ఫెన్సింగ్‌ తక్కువ ఎత్తుతో ఉండగా జింకలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సింగరేణిలో పేలుళ్ల సమయాన శబ్దానికి జీవాలు బెదిరి బయటకు వస్తున్నాయని ఇన్నాళ్లు భావించారు. కానీ రాత్రివేళ వేటగాళ్ల తుపాకీ కాల్పులు, వారి కదలికలే అసలు కారణమని తెలుస్తోంది. ప్రహరీ తక్కువ ఎత్తుతో ఉన్న చోట నుంచి లోనకు వచ్చి వన్యప్రాణులను హతమార్చి అక్కడి నుంచే తీసుకెళ్తున్నారని సమాచారం. పార్క్‌ ముందు భాగంలో సీసీ కెమెరాలు ఉండడం, అక్కడ వాచ్‌మెన్‌ను నియమించడంతో వెనక దారి ఎంచుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement