జిల్లాలో సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో వేగం పెంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారడంతో అధికారుల చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాల్వల నిర్మాణానికి రైతుల పట్టా భూములతో పాటు అటవీశాఖ భూమి సేకరించాల్సి ఉంది. ఈమేరకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించినా పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. – ఖమ్మం అర్బన్
● ‘సీతారామ’ పనులకు అదే అడ్డంకి ● టెండర్లు పిలిచినా భూమి లేక ఇక్కట్లు ● ఇటీవల కలెక్టర్ ప్రత్యేక దృష్టితో వేగం
టెండర్లలోనూ అవాంతరాలు
డిస్ట్రిబ్యూటరీలను జిల్లాలో నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో ఆరో ప్యాకేజీకి టెండర్లు ఖరారైనా భూసేకరణ పూర్తయితే తప్ప పనులు చేసే అవకాశం కానరావడం లేదు. ఇక 3వ ప్యాకేజీ టెండర్లు ఆహ్వానిస్తే ఒకే టెండర్ నమోదైంది. దీంతో ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశారు. అలాగే, 4, 5వ డిస్ట్రిబ్యూటరీల కోసం ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. ఫలితంగా మరోమారు టెండర్లు ఆహ్వానించేలా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి భూసేకరణపై దృష్టి సారించడం ద్వారా పనులు ప్రారంభించేలా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రైవేట్, అటవీ భూములు
ప్యాకేజీల వారీగా నిర్మాణానికి అవసరమైన నిధుల లెక్కలు తేల్చారు. ఈ నిధులతోనే అనుబంధంగా మైనర్లు, సబ్‌స్ట్రక్చర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాక ఎంత భూమి సేకరించాలో కూడా నివేదిక సిద్ధమైంది. ఇందులో ప్యాకేజీ–3కి 700 భూమి అవసరం కాగా, ఇది పూర్తిగా అటవీ శాఖ పరిధిలో ఉంది. అలాగే, ఐదో ప్యాకేజీకి అవసరమైన 924 ఎకరాల్లో 790 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూమి ఉండగా, మిగతా అటవీ భూమి సేకరించాలి. దీంతో ప్యాకేజీల వారీగా అన్ని అడ్డంకులను అధిగమించి టెండర్లు పూర్తిచేసినా భూసేకరణ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం కష్టమేననన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
భూసేకరణ అంశంపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు రెవెన్యూ, జల వనరుల శాఖతో పాటు అటవీ శాఖ అధికారులతో తరచుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటవీ భూములకు సంబంధించి అంతే మేర భూమిని కేటాయిస్తేనే అంగీకరించే అవకాశముంటుంది. దీంతో అటవీ శాఖకు ప్రభుత్వ భూమి కేటాయించేలా అధికారులు జల్లెడ పట్టి కొంతమేర గుర్తించినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో సర్వే అనంతరం కేటాయిస్తే సీతారామ ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంటుంది.


