● పన్ను వసూళ్ల రికార్డులు పరిశీలన ● రాత్రి వరకు కొనసాగిన సోదాలు
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల సమయాన ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వాన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 15 మంది సిబ్బంది కూడిన బృందం కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే తలుపులు మూసివేసి వారు సిబ్బంది సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఖమ్మంలో సమావేశానికి వెళ్తూ మధ్యలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహను వెనక్కి పిలిపించారు. ఆపై ఉద్యోగులను తప్ప మిగతా వారెవరూ లోనకు రాకుండా కార్యాలయం గేట్లు కూడా మూసివేయించారు. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల సమచారం బయటకు పొక్కడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, అధి కారులు కార్యాలయంతో పాటు కమిషనర్ నర్సింహ, మేనేజర్ శ్రీనివాసరావు గృహాల్లో తనిఖీ చేయగా రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి.
పన్నులపై ఫిర్యాదులు రావడంతో..
మున్సిపాలిటీ పరిధిలో ఇంటి, నీటి పన్నుల వసూళ్లకు సంబంధించి రికార్డుల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీ చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈమేరకు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఉద్యోగులను విడివిడిగా విచారించడమే కాక రికార్డులను పరిశీలించామని వెల్లడించారు. పరిశీలన పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు.


