బరి సరే.. భరోసా వస్తుందా?!
ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతోందని ఆందోళన ఆర్థిక సహకారానికి పార్టీలు, నేతల వైపు చూపు
అంత ఖర్చు చేయగలమా ?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నా.. ఆర్థిక పరిస్థితులపై వారిలో హైరానా నెలకొంది. బరిలో నిలిచాక ఖర్చుకు సరిపడా నగదు చేతికి రాకపోతే గెలుపు సాధ్యం కాదనే భానలో కొందరు ఉన్నారు. దీంతో పార్టీలు, ముఖ్య నేతల నుంచి భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో పోటీదారులు కొందరు తమకు ఆర్థికంగా సహరించాలని నేరుగా పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తుండటం గమనార్హం.
పోటీ కోసం ఆసక్తి..
గ్రామాల్లో తమ పట్టును నిరూపించుకోవడానికి కొందరు.. ఉన్న పట్టు కాపాడుకోవడం కోసం పలువురికి గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ అనివార్యంగా మారింది. సర్పంచ్, వార్డులకు అయిన రిజర్వేషన్ల ఆధారంగామండల స్థాయి నేతలు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యాన నేతలు హడావుడి పడుతుండగా, జనరల్‌కు రిజర్వు అయిన మేజర్ గ్రామపంచాయతీల్లో పోటీదారుల భారీగానే ఉంది.
ఆర్ధిక సహకారం ఉంటేనే..
గ్రామ, మండల స్థాయిలో గుర్తింపు ఉండి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉన్న నాయకులే బరిలో నిలవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఇది బాగానే ఉన్నా బరిలో నిలిస్తే ఎలా ఉంటుంది.. లేకపోతే పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. ఎన్నికల వ్యయం తడిసి మోపెడవడం ఖాయమైనందున అంత ఖర్చు మొత్తం తాము భరించే అవకాశం లేదని పేర్కొంటున్నారు. పార్టీ నుంచి ఆర్థిక సహకారం అందితేనే బరిలో ఉంటామని కొందరు ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నారు.
ఆ రెండు పార్టీల్లో మరింతగా..
ఎన్నికల ఖర్చు అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతల్లో సందిగ్ధత ఎక్కువగా ఉంది. ఈ పార్టీల మద్దతుతో బరిలోకి దిగాలనే ఆలోచన ఉన్న నేతలు ఒకరిని చూసి ఇంకొంకరు ఖర్చు పెంచే అవకాశం ఉన్నందున డోలాయమానంలో పడ్డారు. ఆర్థిక వనరులు తమ వద్ద అంతంతమాత్రంగానే ఉన్నందున, పార్టీ నుంచి సహకారం అందాలని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేయాలనుకునే వారు కోరుతున్నారు. ఈ సమాచారం ఎమ్మెల్యేలు, మంత్రులకు చేరవేసే పనిలో పడ్డారు. మరోపక్క బీఆర్‌ఎస్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆశావహులపై జనాభిమానం ఉన్నా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి దీటుగా ఖర్చు చేయాలంటే రూ.లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందేనని భావిస్తున్నారు.
నామినేషన్లు వేస్తున్న ఆశావహుల్లో సందిగ్ధత
నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాగైనా పోటీ చేయాలని గ్రామస్థాయి నేతలు పట్టుదలతో ఉన్నారు. తీరా ఇప్పుడు బరిలో నిలవడానికి సందిగ్ధత ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థితో బేరీజు వేసుకుంటూ ఎన్నికల ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలని మధనపడుతున్నారు. గ్రామస్థాయిలో పార్టీల నాయకులు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారు. అయితే, ఈ ఏడాది పత్తి, వరి పంటల దిగుబడి ఆశాజనకంగా లేకపోవడం, ఉన్న పంటలు కూడా తుపాను ప్రభావంతో పాడవడంతో నష్టాల పాలయ్యారు. దీంతో ఎన్నికల్లో సరిపడా ఖర్చు చేయగలమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు.
బరి సరే.. భరోసా వస్తుందా?!


