కొయ్యలు కలియదున్నితే భూసారం
వరి, పత్తి అవశేషాలు కాలిస్తే నష్టమే...
వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్
సుచరితాదేవి సూచనలు
వైరా: జిల్లాల్లో వానాకాలం సాగైన వరి కోతలు, పత్తితీత చివరి దశకు చేరాయి. వరి 2.82 లక్షల ఎకరాల్లో, పత్తి 1.96 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, హెక్టార్ వరి పంట ద్వారా 6–7.5 టన్నులు, పత్తి ద్వారా 2–3 టన్నులు అవశేషాలు ఉత్పన్నమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, చాలామంది రైతులు అవశేషాలను కొద్దిమేర పశువుల మేత, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నా ఎక్కువ శాతం కాలుస్తున్నారు. దీంతో లాభం లేకపోగా పర్యావరణానికి హానీ జరుగుతుందని, అలాకాకుండా భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుందని వైరా కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి తెలిపారు. ఈమేరకు ఆమె రైతులకు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి.
ఇలా చేస్తే మేలు
స్వల్పకాలిక వరి రకాలను ఎన్నుకుంటే త్వరలో కోతలు పూర్తిచేసి రెండో పంట వేసేలోగా వ్యర్థాలను నేలలో కలియదున్నవచ్చు. కొయ్య కాళ్లను భూమిలో కలియదున్నితే గడ్డి ద్వారా పోషకాలు తిరిగి నేలకు చేరుతాయి. పొలం దున్నే 10 రోజుల ముందు పొలంలో గడ్డి పరిచి నీరు అందించాక ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లితే భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయి పెరుగుతుంది. వరి అవశేషాలను వర్మీ కంపోస్ట్ లేదా బయోచర్ లేదా బయోగ్యాస్ తయారీలో ఉపయోగించవచ్చు. ఇక వరి కోత యంత్రాలకు గడ్డిని చిన్న మొక్కలుగా చేసే పరికరం అమరిస్తే ఫలితం ఉంటుంది. వరి తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లెజ్ పద్ధతిలో సాగు చేయడం మేలు. ఇవికాక పంట అవశేషాలను తగలబెట్టకుండా వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా వినియోగిస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుందని కోఆర్డినేటర్ తెలిపారు.


