భళా.. తపాలా బిళ్ల!
ప్రదర్శనలో 3వేలకు పైగా స్టాంప్‌లు
సేకరణదారుల కృషికి ప్రశంసలు
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఫిలాటికల్ ఎగ్జిబిషన్(స్టాంపుల ప్రదర్శన) ఆకట్టుకుంటోంది. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ గురువారం మొదలుకాగా.. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు తాము సేకరించిన అరుదైన స్టాంపులను ప్రదర్శించారు. ఖమ్మం, హైదరాబాద్‌కు చెందిన నలుగురు 108 ఫ్రేముల్లో 3,456 స్టాంపులను ప్రదర్శించగా.. ఇందులో 1711వ సంవత్సరం విడుదలైన స్టాంపులు కూడా ఉండడం విశేషం. భారత్‌తో పాటు పోర్చుగీసు బ్రిటన్, థాయిలాండ్ ఇండోనేషియా, రుమేనియా, థైవాన్ తదితర దేశాలకు చెందిన స్టాంపులను సైతం ప్రదర్శించారు. కాగా, ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం కూడా కొనసాగుతుందని.. పాఠశాలల విద్యార్థులు, వ్యక్తులు రావొచ్చని అధికారులు సూచించారు.
కాదేదీ అనర్హం
ప్రకృతిలో ఉండే ప్రతీ దృశ్యంతో స్టాంపులను రూపొందించారు. వివిధ దేశాల్లోని ముఖ్య స్థలాలు, ఆయా దేశాల ప్రతినిధులు, ప్రముఖుల ఫొటోలతో స్టాంపులు రూపొందాయి. జంతువులు, పక్షులు, సముద్రపు జీవులు, క్రీడా వస్తువులు, ఖాదీ వస్త్రాలు, కలప, మెటల్స్, మెడిసిన్ వంటి రంగాలే కాక ఆహార పదార్థాల దృశ్యాలు కూడా స్టాంపులపై ముధ్రితమయ్యాయి. ఖమ్మంలో నిర్వహించిన ప్రదర్శనలో మహాత్మాగాంధీ ఖాదీ వస్త్రాలతో కూడిన తొలి స్టాంప్‌ను ప్రదర్శించగా.. పావు అణా ధర మొదలు వివిధ ధరల్లో విడుదలైన స్టాంపులు ఆకట్టుకున్నాయి.
ఖమ్మంకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఎన్‌కే.సాబూ వైద్యం చేస్తూనే స్టాంపుల సేకరణను హాబీగా మలుచుకున్నారు. తొలినాళ్లలో జైపూర్ కలెక్టర్‌గా పనిచేసిన సోడాను స్ఫూర్తిగా ఏడో తరగతి నుంచే స్టాంపుల సేకరణ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇండియా, పోర్చుగీసు, బిట్రన్, థాయ్‌లాండ్, రుమేనియా తదితర దేశాల స్టాంపులను సేకరించగా, ఎక్కడ ప్రదర్శన జరిగినా వెళ్తానని పేర్కొన్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫిలాటలిక్ ఎగ్జిబిషన్లకూ సైతం హాజరవుతున్నానని చెప్పారు. ఇప్పటివరకు బంగారు, వెండి పతకాలు సాధించిన సాబూ.. స్టాంపుల సేకరణ గొప్ప అనుభూతిని ఇస్తుందని తెలిపారు.
స్టాంపుల సేకరణను మరో ప్రపంచంగా అభివర్ణించారు హైదరాబాద్‌కు చెందిన దేవేందర్ కుమార్ జైన్. దేశాల సంస్కృతులు ఈ స్టాంపుల్లో ప్రతిబింబిస్తాయని తెలిపారు. జంతు రూపాలు, వస్తు రూపాలు, రంగులు, వస్త్రాలు వంటి ప్రకృతిలో ఉండే అన్నింటిపై స్టాంపులు రూపొందాయని చెప్పారు. 5వ తరగతి నుంచి తనకు స్టాంపుల సేకరణపై ఆసక్తి ఏర్పడిందని.. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నా స్టాంపుల సేకరణ విడిచిపెట్టలేదని వెల్లడించారు. దేశ, విదేశాల్లో నిర్వహించే స్టాంపుల ఎగ్జిబిషనల్లో పాల్గొంటూ అక్కడకు వచ్చే పోటీదారుల నుంచి మరిన్ని స్టాంపుల సేకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో ఒక్కోసారి చాలా సమయం పడుతుందని, వ్యయప్రయాసలు ఓర్చుకోవాల్సి వస్తుందని దేవేందర్ వెల్లడించారు.
ఆకట్టుకుంటున్న
ఫిలాటికల్ ఎగ్జిబిషన్
భళా.. తపాలా బిళ్ల!
భళా.. తపాలా బిళ్ల!
భళా.. తపాలా బిళ్ల!
భళా.. తపాలా బిళ్ల!


