నగదుతో వెళ్తే పత్రాలు తప్పనిసరి
ఖమ్మంసహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు అధికార యంత్రాంగం నిఘా పటిష్టం చేసింది. ఈమేరకు ఎవరైనా రూ.50వేల కంటే నగదు తీసుకెళ్లాలంటే సరైన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు. గ్రామస్థాయి ఎన్నికలు కావడం, ఇదే సమయాన రైతుల చేతికి పంట డబ్బు వస్తుండడంతో ఇబ్బంది పడే అవకాశముంది. ఈమేరకు నగదు తీసుకెళ్లే వారు సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు తెలిపారు.
15 మంది నోడల్ అధికారుల నియామకం
ఖమ్మంసహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13విభాగాలుగా విభజించి 15మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు 15మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
విత్తన బిల్లుపై నేడు సమావేశం
ఖమ్మంవ్యవసాయం: ‘విత్తన బిల్లు ముసాయిదా’పై శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉదయం 11గంటలకు సమావేశం మొదలవుతుందని వెల్లడించారు. విత్తన అనుబంధ శాఖలు, కంపెనీల డీలర్లు, రైతులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు పాల్గొనాలని ఆయన సూచించారు.


