పాలిట్రిక్స్!
పురుషుల కన్నా
25,818 మంది ఎక్కువ
రిజర్వేషన్‌లోనూ
మెజార్టీ సర్పంచ్, వార్డు స్థానాలు
అభ్యర్థుల ఎంపిక, పోలింగ్‌లో
అతివలపై పార్టీల దృష్టి
ఆమె చుట్టే
మహిళలే కీలకం
గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే శక్తిగా మహిళలు నిలవనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కన్నా 25,818 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థులు అతివల ఓట్లు రాబట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
బరిలోనూ ప్రాధాన్యత
యాభై శాతం రిజర్వేషన్లతో అతివలకు రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం దక్కింది. గతంతో పోలిస్తే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లు రిజర్వ్ అయ్యాయి. మొత్తం 566 స్థానాలకు గాను 259 జీపీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా మహిళలే బరిలోకి దిగనున్నారు. ఇక 5,168 వార్డుల్లో 2,230 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ బలమైన మహిళా నేతలు ఉంటే వారినే పోటీకి దింపే అవకాశముంది. తద్వారా ఓటర్లుగానే కాకుండా అభ్యర్థులుగానూ అతివలకు ప్రాధాన్యత దక్కనుంది.
అందరి చూపు అటే..
గ్రామపంచాయతీ ఎన్నికలు మహిళలే ప్రాధాన్యతగా జరగనున్నాయి. ఈ నేపథ్యాన రాజకీయ పార్టీల నాయకులు మహిళలకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాలను లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. రిజర్వ్‌డ్ స్థానాల్లో తాము మద్దతు ఇచ్చే మహిళా అభ్యర్థులను పోటీకి దింపాల ని వ్యూహరచన చేస్తున్నారు. అన్ని పార్టీలు ఇలాగే ఆలోచిస్తుండడంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న మహిళలకు మంచి అవకాశాలు దక్కనున్నాయి. పార్టీల్లో చురుకై న మహిళా నాయకులతో పోటీ చేయించడంపై నాయకులు, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు యత్నాలు ప్రారంభించారు.
అన్నింటా పైచేయి
జిల్లాలోని ఇరవై మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నేలకొండపల్లి మండలంలో 2,004 మంది మహిళా ఓటర్లు, రఘునాథపాలెం 1,948, తిరుమలాయపాలెంలో 1,656, కూసుమంచిలో 1,646, ఖమ్మంరూరల్‌లో 1,485 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు ఓటరు జాబితా ద్వారా తేలింది. మిగిలిన మండలాల్లో కూడా పురుషులు, మహిళా ఓటర్ల మధ్య తేడా భారీగా ఉంది.
జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం


