పల్లె పోరుకు నగారా
విడతల వారీగా గ్రామపంచాయతీ ఎన్నికల వివరాలు
జిల్లా జీపీలకు మూడు విడతల్లో ఎన్నికలు
● మొదటి, చివరి విడత ఏడు చొప్పున.. రెండో విడతలో ఆరు మండలాలు ● వచ్చే నెల 11, 14, 17వ తేదీల్లో పోలింగ్, అదేరోజు ఫలితాలు ● 566 గ్రామపంచాయతీలు, 5,168 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు ● కోర్టు ఉత్తర్వులతో ఐదు పంచాయతీల్లో బ్రేక్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పల్లె పోరుకు నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలోని 566 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఏన్కూరు మండలంలోని నాలుగు, పెనుబల్లి మండలంలో ఒక పంచాయతీలో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం వేగం పెంచనుంది.
అంతా సిద్ధం
ఎన్నికలకు ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు.. షెడ్యూల్ రావడంతో పూర్తిస్థాయిలో సమాయత్తమవుతున్నారు. పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్‌బాక్స్‌లు, ఇతర సామగ్రి సమకూర్చుకోవడంతో పాటు తనిఖీ చేసి పెట్టుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా పీఓలు, ఏపీల నియామకం కూడా పూర్తయింది. ఇక నామినేషన్లు స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లు చేయనున్నారు.
ఈనెల 27 నుంచి ప్రక్రియ
మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ఈనెల 27న జిల్లా ఎన్నికల అధికారి నోటిఫికేషన్‌తో ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చేనెల 11న మొదటి విడత ఎన్నికలు ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించి, అదే రోజు ఓట్లు లెక్కిస్తారు. కాగా, ఈ విడతలో 2,089 పోలింగ్ బాక్స్‌లు వినియోగించనుండగా, అంతే సంఖ్యలో పీఓలు, 2,551 మంది ఓపీఓలు విధులు నిర్వర్తిస్తారు. రెండో విడత నోటిఫికేషన్ ఈనెల 30న జారీ కానుండగా, అదే రోజు నుంచి వచ్చేనెల 2వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ విడత పోలింగ్ వచ్చేనెల 14న నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,023 పోలింగ్ బాక్స్‌లు వినియోగిస్తారు. అలాగే, 2,203 మంది పీఓలు, 2,580మంది ఓపీఓలను విధులకు కేటాయించారు. ఇక మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనెల 3న జారీ అవుతుంది. అదేరోజు నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 17వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, చివరి విడతలో 6,023 పోలింగ్ బాక్స్‌లను వినియోగించనుండగా, విధినిర్వహణ కోసం 6,204 మంది పీఓలు, 7,768మంది ఓపీఓలను నియమించారు. తద్వారా ఈనెల 27న ప్రారంభమయ్యే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వచ్చేనెల 17వ తేదీతో ముగియనుంది.
ఆ గ్రామాల్లో బ్రేక్
కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఏన్కూరు మండలంలోని ఏన్కూరు, నాచారం, ఆరికాయలపాడు, జన్నారం, పెనుబల్లి మండలంలోని గౌరారం పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు. ఈ ఐదు గ్రామపంచాయతీలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించి సర్పంచ్ పదవులను ఎస్టీలకు రిజర్వు చేశారు. అయితే ఇక్కడ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నందున మైదాన ప్రాంతంగా ప్రకటించాలని, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించవద్దని రాజకీయ పార్టీల నేతలు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఇటీవల వినతిపత్రం అందజేశారు. అంతేకాక గతంలో కోర్టుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వగా.. ఎన్నికల నిర్వహణ నిలిపివేశారు.
మూడో విడత
మండలం జీపీలు వార్డులు పీఎస్‌లు
ఏన్కూరు 21 178 178
కల్లూరు 23 214 214
పెనుబల్లి 32 290 290
సత్తుపల్లి 21 208 208
తల్లాడ 27 252 252
వేంసూరు 26 244 244
సింగరేణి 41 356 356
మొత్తం 191 1,742 1,742
మొదటి విడత
మండలం జీపీలు వార్డులు పీఎస్‌లు
కొణిజర్ల 27 254 254
రఘునాథపాలెం 37 308 308
వైరా 22 200 200
బోనకల్ 22 210 210
చింతకాని 26 248 248
మధిర 27 236 236
ఎర్రుపాలెం 31 284 284
మొత్తం 192 1,740 1,740
రెండో విడత
మండలం జీపీలు వార్డులు పీఎస్‌లు
కామేపల్లి 24 218 218
ఖమ్మంరూరల్ 21 202 202
కూసుమంచి 41 364 364
ముదిగొండ 25 246 246
నేలకొండపల్లి 32 300 300
తిరుమలాయపాలెం 40 356 356
మొత్తం 183 1,686 1,686
పల్లె పోరుకు నగారా
పల్లె పోరుకు నగారా


