‘మీ డబ్బు, మీ హక్కు’పై 28న శిబిరం
ఖమ్మం సహకారనగర్: క్లెయిమ్ చేసుకోని ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 28న ‘మీ డబ్బు.. మీ హక్కు’ పేరిట శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పొదుపు ఖాతాలు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 28న కలెక్టరేట్ ఆవరణలో ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు శిబిరం జరుగుతుందని తెలిపారు. క్లెయిమ్ చేసుకోని ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లను ‘ఆర్‌బీఐ ఉద్గమ్ వెబ్‌సైట్’ ద్వారా పొందాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రతీ వాహనాన్ని
తనిఖీ చేయాల్సిందే..
వేంసూరు: సన్నరకం ధాన్యానికి తెలంగాణలో రూ.500 బోనస్ ఇస్తుండగా, ఏపీ నుంచి ధాన్యం తీసుకురాకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేశారు. ఈమేరకు మండలంలోని కేజీ.మల్లెల వద్ద చెక్‌పోస్టును కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఏపీ మీదుగావచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి అనుమతి పత్రాలు పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వేంసూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆమె పెండింగ్ కేసుల దర్యాప్తు, చార్జీషీట్ల దాఖలుపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యాన రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా వేయాలని సూచించారు. అలాగే, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో వేగం పెంచాలని ఏసీపీ తెలిపారు. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగంగౌడ్, ఎస్‌ఐ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు
సత్తుపల్లిటౌన్: ఖమ్మం రీజియన్‌లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచినట్లు రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోను మంగళవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. శబరిమలై వెళ్లే మాలధారులు సూచించిన రూట్ ప్రకారం బస్సులు ఏర్పాటుచేయనున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ‘యాత్రాదానం’ పేరిట దాతలు ముందుకొచ్చి అవసరాలు ఉన్న వారికి బస్సులు సమకూర్చే అవకాశముందని తెలిపారు. కాగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగారూట్లలో బస్సుల సంఖ్య పెంచామని చెప్పారు. డిపో మేనేజర్ ఊటుకూరి సునీత, అసిస్టెంట్ మేనేజర్ పి.విజయశ్రీ, అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ సాహితి, ఉద్యోగులు పాల్గొన్నారు.
గన్నీ సంచుల కోసం పోటాపోటీ
‘మీ డబ్బు, మీ హక్కు’పై 28న శిబిరం
‘మీ డబ్బు, మీ హక్కు’పై 28న శిబిరం


