హత్యకేసును నీరుగార్చే ప్రయత్నం..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
‘సామినేని’ హంతకులను
అరెస్ట్ చేయాలని ఆందోళన
ఖమ్మంమయూరిసెంటర్: చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసును నీరుగార్చేలా అధికార పార్టీ సూచించినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు. రామారావు హత్య ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో నిరసన తెలపగా జాన్‌వెస్లీ మాట్లాడారు. రామారావుది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ విషయంలో భయపెట్టే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కలెక్టర్, సీపీ ఇకనైనా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు సీపీతో పాటు డిప్యూటీ సీఎం భట్టిని వదిలిపెట్టేది లేదన్నారు. పోలీసులు పక్షపాతంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టంపై గౌరవం ఏం ఉంటుందని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ పోలీసుల విచారణ కేసును పక్కదారి పట్టించేలా జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, న్యూడెమోక్రసీ నాయకుడు కోల లక్ష్మీనారాయణ ధర్నాకు సంఘీభావం తెలపగా సీపీఎం నాయకులు బండి రమేష్, వై.విక్రమ్, పొన్నం వెంకటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, సామినేని రామారావు సతీమణి స్వరాజ్యం, కుమారుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్రిక్తంగా మారిన నిరసన
రామారావు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని సీపీఎం ఆధ్వర్యాన ధర్నాచౌక్‌లో నిరసన తెలిపాక కలెక్టరేట్‌కు బయలుదేరారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లతో అడ్డుకోగా పార్టీ శ్రేణులు వారిని నెట్టుకొని కలెక్టరేట్ గేటు వైపు వెళ్లారు. ఈ క్రమంలో తోపులాట జరగగా జాన్‌వెస్లీ, పోతినేని తదితరులు రోడ్డుపై బైఠాయించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటుంటే కార్యకర్తలు అడ్డుతగలడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైవేపై నాయకులు గంటకు పైగా బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఇక కార్యకర్తలు బారికేడ్లను నెట్టడంతో బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ రమేష్ కాలికి గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్తే కాలు విరిగిందని నిర్ధారించారు. అలాగే, తోపులాటలో జాన్‌వెస్లీ అస్వస్థతకు గురయ్యారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు ఆధ్వర్యాన ఏసీపీలు రమణమూర్తి, సర్వర్, శ్రీనివాసులుతో పాటు సుమారు 100 మందితో బందోబస్తు నిర్వహించారు.
హత్యకేసును నీరుగార్చే ప్రయత్నం..


