నీటి కోసం జైలుకు వెళ్లా.. | - | Sakshi
Sakshi News home page

నీటి కోసం జైలుకు వెళ్లా..

Nov 23 2025 6:03 AM | Updated on Nov 23 2025 6:03 AM

నీటి కోసం జైలుకు వెళ్లా..

నీటి కోసం జైలుకు వెళ్లా..

విద్యతోనే నిరుపేద కుటుంబాల్లో వెలుగులు

ప్రతీ నియోజకవర్గంలో

‘యంగ్‌ ఇండియా’ పాఠశాల

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వైరా/వైరారూరల్‌: వైరా రిజర్వాయర్‌ అడుగంటితే 2003 ప్రాంతంలో తమ నాయకులతో నీరు విడుదల చేయాలని దీక్షలు, ధర్నాలు చేయడమే కాక ఏన్కూరులోని తిమ్మరావుపేట సాగర్‌ కెనాల్‌ గేట్లు తెరిచామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. ఆ సమయాన తనపై తొలిసారి కేసు నమోదు కావడమే కాక జైలుకు వెళ్లానని తెలిపారు. వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌తో పాటు వివిధ మండలాల్లో ఏడు సబ్‌స్టేషన్లు, రోడ్డు పనులు, ఇతర అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యతోనే నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నిండుతాయనే భావనతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారంచుట్టామని తెలిపారు. ఇందులో ఆంగ్ల మాధ్యమంలో బోధనతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నిర్మాణ పనులకు ఇప్పటికే రూ.30కోట్లు విడుదల చేశామని చెప్పారు. కాగా, గురుకులాల్లో కలెక్టర్‌ సహా అధికారులు తనిఖీ చేస్తూ భోజనం నాణ్యత మెరుగుపడేలా చూడాలని సూచించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైరా రిజర్వాయర్‌ ఆధునికీకరణకు రూ.42కోట్లు విడుదలైతే మళ్లీ తాము వచ్చాకే రూ.40 కోట్లు విడుదల చేశామని భట్టి వివరించారు. రహదారుల వెంట షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలోనే అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.153.36 కోట్ల రుణాల చెక్కుతో పాటు ఇందిరమ్మ చీరలను భట్టి పంపిణీ చేశారు. కలెక్టర్‌ ఆనుదీప్‌ దురిశెట్టి మాట్లాడుతూ యంగ్‌ ఇండియా గురుకులం భవన నిర్మాణం నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాని అధికారులను ఆదేశించారు. అలాగే, 18ఏళ్లు నిండిన మహిళ లందరికీ ఇందిరమ్మ చీరలు అందుతాయని తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌ నాయక్‌ మాట్లాడుతూ వైరా నియోజకర్గంలో గడిచిన రెండేళ్లలో రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వైరా, కారేపల్లిలో కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, సీపీ సునీల్‌దత్‌, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త రాజశేఖర్‌, మార్కెట్‌ చైర్మన్‌ బొళ్ల గంగారావుతో పాటు బొర్రా రాజశేఖర్‌, కొండబాల కోటేశ్వరరావు, పొట్ల నాగేశ్వరరావు, సూతకాని జైపాల్‌, కట్ల రంగారావు, కోసూరి శ్రీను, శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు, నూతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement