ముడుపులు ఇస్తేనే మృతదేహం
వసూళ్ల వ్యవహారం మా దృష్టికి వచ్చింది
● పెద్దాస్పత్రి మార్చురీలో సిబ్బంది చేతివాటం ● శవపరీక్షకు ముందే బంధువులతో బేరసారాలు ● ఎవరైనా నిరాకరిస్తే నిబంధనల పేరుతో ఇక్కట్లు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మార్చురీలో కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావివ్వడమే కాక మృతుల బంధువులను ఆవేదనకు కారణమవుతోంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహన్ని అప్పగించడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాస్పత్రి డీఎంఈ పరిరిధిలోకి వెళ్లి రెండేళ్లు పూర్తవగా, ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చింది. ఇక ఆస్పత్రి వెనుక భాగంలో మార్చురీ ఏర్పాటు చేసి దశాబ్దాలు కావొస్తోంది. ఇందులో పనిచేసేలా సిబ్బంది కొందరు మృతదేహం అప్పగింతకు డబ్బు చెల్లించాల్సిందేనని వేధిస్తున్నట్లు చెబుతున్నారు. పూర్తిస్ధాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే సిబ్బంది ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని తెలుస్తోంది.
రూ.3వేలకు పైగానే...
పెద్దాస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చాక శవపరీక్షలు వేగంగానే జరుగుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా శవపరీక్ష తర్వాత మృతదేహన్ని కుటుంబీకులకు అప్పగించడానికి సిబ్బంది రేట్లు ఫిక్స్ చేశారు. ఒక్కో మృతదేహానికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కొందరు ఇస్తున్నా, నిరుపేదలు నిరాకరిస్తే సవాలక్ష నిబంధనలు చెబుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. పురుగుల మందు తాగిన వారు, ఉరి వేసుకున్న వారి మృతదేహాలతో పాటు రైలు ప్రమాదాలు, ఘర్షణల్లో మృతి చెందిన వారే కాక అనుమానిత కేసుల్లో మృతదేహాలను మార్చురీకి తీసుకొస్తారు. వైద్యులు శవపరీక్ష అనంతరం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు.
ఆతృత ఆధారంగా డిమాండ్
ఖమ్మం పరిసరాల్లో రైల్వేలైన్, జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ మార్గాల్లో జరిగే ప్రమాదాల్లో మృతి చెందిన వారితో ఇతర అనుమానిత కేసుల్లో మృతదేహాలను ఖమ్మం మార్చురీకి తీసుకొస్తారు. గతంతో పోలిస్తే శవపరీక్షలు వేగంగా జరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాత్రి కూడా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పెద్దాస్ప మార్చురీకి 2024లో 1,218 మృతదేహాలకు, 2025లో ఇప్పటి వరకు 774 మృతదేహలకు పోస్టుమార్టం జరిగింది. ఇక్కడకే తీసుకొచ్చే మృతదేహాల సంఖ్య పెరుగుతుండడం సిబ్బంది వరంలా మారింది. మృతుల కుటుంబీకులు ఆవేదనతో ఉండడం.. త్వరగా మృతదేహలను తీసుకెళ్లాలనే ఆతృతను తమకు అనుగుణంగా మలుచుకుని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన వారికి వెంటనే మృతదేహాన్ని అప్పగిస్తుండగా, ఎవరైనా నిరాకరిస్తే మానసికంగా వేధిస్తున్నారు.
మృతుల బంధువుల నుంచి మార్చురీ సిబ్బంది డబ్బు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సిబ్బందికి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదు. పెద్దాస్పత్రిలో సేవలన్నీ ఉచితంగానే అందుతాయి. ఇకపై నిఘా పెంచడంతో పాటు ఫిర్యాదు అందితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– ఎం.నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్
ముడుపులు ఇస్తేనే మృతదేహం


