పత్తి రైతులపై పాలకుల వివక్ష
ఖమ్మంవైరారోడ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులపై వివక్ష చూపిస్తున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొనగా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో పత్తి దిగుబడి తగ్గగా, సీసీఐ కేంద్రాల్లో నిబంధనల పేరిట కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని.. ఫలితంగా ప్రైవేట్ గా అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారని తెలి పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బిడ్డే అయినందున రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్‌తో పాటు బెల్లం వేణు, పగడాల నాగరాజు, వీరూనాయక్, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, ముత్యాల వెంకటఅప్పారావు, తాజుద్దీన్ పాల్గొన్నారు. కాగా, మధిర, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నాయకులు కలెక్టర్ అనుదీప్‌ను కోరారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు కలెక్టర్‌ను కలిశారు.
హంతకులను కనిపెట్టలేని స్థితిలో ప్రభుత్వం
చింతకాని: సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి 19 రోజులు గడినా హంతకులను కనిపెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ విమర్శించారు. చింతకాని మండలం పాతర్లపాడులో మంగళవారం రామారావు కుటుంబాన్ని పరామర్శించాక ఆయన మాట్లాడారు. ఉప ముఖ్య మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క నియోజకవర్గంలో జరిగిన హత్యపై ఆయన సమాధానం చెప్పాలని సూచించారు. అంతేకాక హంతకులను గుర్తించి పోలీసులు నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. అనంతరం నాగులవంచలో ఇటీవల మృతి చెందిన సీపీఎం నాయకురాలు వంకాయలపాటి సుగుణమ్మ కుటుంబాన్ని సైతం మధు పరామర్శించారు. జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నాయకులు బెల్లం వేణు, బొడ్డు వెంకట్రామయ్య, మంకెన రమేష్, గురిజాల హన్మంతరావు, తాతా ప్రసాద్, సామినేని అప్పారావు, కోపూరి నవీన్, రాచబంటి రాము, కోండ్రు జానకీరామయ్య, కాటబత్తిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం మార్కెట్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన


