● రాజకీయ దురుద్దేశంతోనే రామారావు హత్య ● సంస్మరణ సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
చింతకాని: మండలంలోని పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత సాయినేని రామారావు హత్య రాజకీయ దురుద్దేశంతో పథకం ప్రకారమే జరిగిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు పేర్కొన్నారు. ఇటీవల హత్యకు గురైన రామారావు సంస్మరణ సభ గ్రామంలో శనివారం నిర్వహించగా రాఘవులు మాట్లాడారు. ఘటన జరిగిన రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించిన ప్రకటనతో సంతృప్తి లేదని చెప్పారు. ఆ ప్రకటన కార్యరూపం దాలిస్తేనే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, రామారావును రాజకీయంగా ప్రత్యర్ధులు అడ్డు తొలగించుకునేందుకు ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్లుగా ఉందన్నారు. ఏ రాజకీయ ఉద్దేశంతో రామారావును హత్య చేశారో అదే ఉద్దేశంతో శత్రువులను దెబ్బకొట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాగా, హత్య జరిగి 9 రోజులు గడిచినా నిందితులను కనిపెట్టలేని కాంగ్రెస్‌ది దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద హోం శాఖ ఉండగా, మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టివిక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారని, జిల్లా నుంచే మరో ఇద్దరు మంత్రులు ఉన్నా నిందితుల గుర్తింపులో ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. రామారావును కాంగ్రెస్ శ్రేణులే హత్య చేశారని తాము చెబుతున్నందున, నిజం కాకపోతే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రామారావు హత్య వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారనేది వాస్తవమని తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న చట్టం పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, అది అమలైతే 30రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులు పదవి కోల్పోతారని చెప్పారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు సీపీఎం, సీపీఐ నాయకులు సోమయ్య, బండారు రవికుమార్, భాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌రావు, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, నున్నా నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, బండి రమేష్, మడుపల్లి గోపాలరావు, రాచబంటి రాము తదితరులు పాల్గొన్నారు.


